పెరిగిన రేప్​లు, సైబర్​ నేరాలు.. భద్రాద్రికొత్తగూడెం జిల్లా క్రైం రిపోర్ట్​ రిలీజ్​

  • నక్సల్స్​ నియంత్రణలో జిల్లా పోలీసులకుముందడుగు.. 
  • తగ్గిన కిడ్నాప్​లు, వరకట్న హత్యలు, దొంగతనాలు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : నక్సల్స్​ నియంత్రణలో భద్రాద్రికొత్తగూడెం జిల్లా పోలీస్​లు ప్రతిభ కనపర్చారు. నేరాల నియంత్రణలో వెనుకబడ్డారు. గతేడాది కంటే రాబరీలు, రేప్​లు, పోక్సో కేసులు,చోరీలు, సైబర్​ నేరాలు పెరిగాయి. ఇండ్ల దొంగతనాలు, కిడ్నాప్​లు, వరకట్న హత్యలు గతేడాది కంటే తగ్గాయి. 2024 సంవత్సరానికి సంబంధించిన క్రైం వివరాలను జిల్లా ఎస్పీ ఆఫీస్​లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ బి.రోహిత్ రాజు వివరించారు. అనంతరం బుక్​ లెట్​ రిలీజ్​ చేశారు. 

గోదావరి వరదల టైంలో ప్రాణ నష్టం లేకుండా చేయడంలో మిగిలిన శాఖలను కలుపుకొని పోలీస్​లు చేసిన సేవలు మరువలేనివన్నారు. ఎస్సైతో పాటు ఇద్దరు పోలీస్​ సిబ్బంది ఆత్మహత్యలకు పాల్పడడం తనను కలిచి వేసిందన్నారు. పోలీస్​లకు యోగాతో పాటు వ్యక్తిత్వ వికాస నిపుణులతో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 

నక్సల్స్​ నియంత్రణలో ... 

మావోయిస్టుల నియంత్రణలో రాష్ట్రంలోనే జిల్లాకు మంచి పేరు వచ్చింది. ఉన్నతాధికారుల నుంచి జిల్లా పోలీస్​లు శభాష్​ అని పించుకున్నారు. ఈ ఏడాదిలో వివిధ హోదాలకు చెందిన 59 మంది మావోయిస్టు నేతలు, సానుభూతిపరులను అరెస్ట్​ చేశారు. అరెస్టు అయిన వారిలో మావోయిస్టు పార్టీ, న్యూడెమోక్రసీలకు చెందిన స్టేట్​ కమిటీ సెక్రటరీ, స్టేట్​ కమిటీ మెంబర్​, సౌత్​ బస్తర్​ కీలక నేతతో పాటు అజ్ఞాత నక్సల్స్​ దళం సభ్యులున్నారు. 31 మంది సరెండర్​ అయ్యారు. 

ఇందులో మావోయిస్టు పార్టీకి చెందిన ఏసీఎంతో పాటు దళం, మిలిటరీ కమాండర్లు, మెంబర్లున్నారు. జిల్లాలో రెండు కీలక ఎన్​కౌంటర్లు జరిగాయి. రెండు దళాలు తుడిచిపెట్టుకుపోయాయి. 441 జిలిటెన్​ స్టిక్స్​, 27 ఎలక్ట్రిక్​ డిటోనేటర్స్​ విత్​ వైర్​, 1000 వైర్​ లేని డిటోనేటర్స్​తో పాటు పలు వెపన్స్​ను స్వాదీనం చేసుకున్నారు. పలు చోట్ల మందుపాతర్లను డిస్పోజల్​ చేశారు. 

రూ. 90కోట్ల విలువైన గంజాయిని దహనం చేశారు. రాష్ట్రంలోనే తొలిసారిగా జిల్లాలో డాగ్​ స్క్వాడ్స్​తో గంజాయిని పట్టుకున్నారు.   

412 దొంగతనాల కేసుల్లో రూ. 3.20కోట్ల సొత్తు పోగా రూ. 1.35కోట్ల మేర రికవరి చేశారు.ఎస్సీ, ఎస్టీ కేసులతో పాటు మహిళల వేధింపు కేసులు గతేడాది కంటే పెరిగాయి. 
పోలీస్​ శాఖకు సంబంధించి ఆరు విభాగాల్లో డయల్​ 100, ఇన్విస్టిగేషన్​, కోర్టు డ్యూటీ ఆఫీసర్స్​ వంటి నాలుగు విభాగాల్లో జిల్లా ప్రతిభ చూపి రాష్ట్రంలో భేష్​ అనిపించుకుంది. 

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో దాదాపు రూ. 90 కోట్లతో ఎల్​ డబ్ల్యు ఈ ఫండ్స్​తో డెవలప్​మెంట్​ వర్క్స్​ జరుగుతున్నాయి. 

గోదావరి వరదల టైంలో ప్రాణ నష్టం లేకుండా చేయడంలో పోలీస్​లు కీలక భూమిక పోషించారు. ఖమ్మం వరదల టైంలో వారికి సాయంగా జిల్లా పోలీస్​లు సేవలందించారు. 

పోలీస్​లకు భరోసా కల్పించేలా 

జిల్లాలో ఎస్సైతో పాటు ఇద్దరు పోలీస్​ సిబ్బంది ఆత్మహత్యలకు పాల్పడడం విచారకరం. డ్యూటీలతో పాటు కుటుంబంలో నెలకొన్న ఒత్తిళ్లను  పోగొట్టుకునేలా పోలీస్​లకు యోగాతో పాటు వ్యక్తిత్వ వికాస నిపుణులతో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. సైబర్​ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఏదేని సైబర్​ క్రైం జరిగిన వెంటనే పోలీస్ లకు సమాచారం ఇవ్వడం మూలంగా పోగొట్టుకున్న సొత్తును రికవరీ చేసేందుకు అవకాశాలున్నాయి. కొత్తగూడెంతో పాటు జిల్లాలో ట్రాఫిక్​ నియంత్రణపై స్పెషల్​ ఫోకస్​పెట్టనున్నాం. సీసీ కెమోరాల ఏర్పాటుకు ప్లాన్​ చేస్తున్నాం. అశ్వారావుపేట మండలంలోని పెద్దవాగు వరదలో చిక్కుకున్న 40 మందిని కాపాడడం పోలీస్​ల కృషి మరువలేనిది.  - బి. రోహిత్​ రాజు, ఎస్పీ, భద్రాద్రికొత్తగూడెం

క్రైం పేరు                              2023      2024
ఎఫ్​ఐఆర్​లు                         2,333     2,375 
రాబరీలు                               0                05
పోక్సో కేసులు                      86             105
డోమెస్టిక్​ వాయ్​లెన్స్          403           420
ఆర్డినరీ థెఫ్ట్​లు                   223           265    
పీడీఎస్​ రైస్                        64               71
ఇసుక అక్రమ రవాణా        05              215
కిడ్నాప్​లు                           98              77
చీటింగ్స్​                             260            303
 సైబర్​ క్రైమ్స్​                    138            196
టోటల్​ యాక్సిడెంట్స్      515            491