- ఇండ్ల వాల్యూయేషన్‌కు రంగంలోకి ఆర్ అండ్ బీ
- నిర్వాసితులకు సమాచారం ఇచ్చిన రెవెన్యూ శాఖ
భద్రాచలం, వెలుగు : భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో మాడవీధుల్లో భూసేకరణలో ముందడుగు పడింది. ఇండ్ల వాల్యూయేషన్‌కు ఆర్ అండ్ బీ శాఖను రంగంలోకి దించారు. ఈ మేరకు నిర్వాసితులకు గరువారం రెవెన్యూశాఖ సమాచారం ఇచ్చింది. రెండు, మూడు రోజుల్లో ఇంజినీర్లు సేకరించిన 1.20 ఎకరాల భూమిలో ఉన్న ఇండ్ల విలువను లెక్కకట్టనున్నారు. పరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం ఇప్పటికే రూ.60.20కోట్లను విడుదల చేసింది. స్పెషల్ ఆఫీసర్ ఐటీడీఏ పీవో బి.రాహుల్ నేతృత్వంలో గ్రామసభను నిర్వహించారు.
ఆలయానికి మూడు వైపులా ఉన్న సేకరించాల్సిన స్థలాన్ని సర్వే చేశారు. 46 ఇండ్లను రామాలయం అభివృద్ధి కోసం సేకరిస్తున్నారు. నష్టపరిహారం విషయం అంచనాలు వేస్తున్నారు. ప్రస్తుతం భద్రాచలం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం లెక్కల ప్రకారం చదరపు అడుగు నివాస భూమికి రూ.5,800, కమర్షియల్ భూమికి చదరపు అడుగుకు రూ.7,800 ధర ఉంది. ఈ మొత్తానికి మూడు రెట్లు కలిపి నిర్వాసితులకు ఇవ్వనున్నారు. భూసేకరణ నోటిఫికేషన్ పబ్లికేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యింది. ఆర్ అండ్ బీ ఇంజినీర్లు ఇచ్చే హౌస్ వాల్యూయేషన్ వివరాలతో నిర్వాసితుల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తారు.
ఆ ఏడు ఇండ్లతోనే తిరకాసు..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హయాంలో 2011లో మాడవీధుల అభివృద్ధికి భూసేకరణ చేపట్టారు. అప్పుడు తీసుకున్న ఏడు ఇండ్లకు పరిహారం మంజూరు చేశారు. కానీ ఆ ఇండ్లకు చెందిన ఐదుగురు యజమానులు తమకు ఈ పరిహారం వద్దంటూ కోర్టును ఆశ్రయించారు. ఆ స్టే ఇంకా కొనసాగుతోంది. ఇప్పుడు సేకరించే 46 ఇండ్లలో ఈ ఏడు ఇండ్లు కూడా ఉన్నాయి.
వీరికి ఇచ్చే పరిహారంలోనే అసలు తిరకాసు ఉంది. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారమే అకౌంట్లో పరిహారం జమచేస్తామని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. కానీ తమకు ప్రస్తుత ధరల ప్రకారమే పరిహారం కావాలని ఆ ఏడుగురు నిర్వాసితులు మెలిక పెడుతున్నారు. ఇప్పుడు ఇది అధికారులకు తలనొప్పిగా మారింది.
భూసేకరణ జాప్యంపై మంత్రి సీరియస్
భూసేకరణ త్వరగా చేపట్టాలని జిల్లాకు చెందిన మంత్రులు ఆఫీసర్లకు టార్గెట్ పెట్టారు. ఇటీవల భద్రాచలంలో పర్యటించిన రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూసేకరణలో జాప్యం విషయంలో ఆఫీసర్లపై సీరియస్ అయ్యారు. ఆలయం మాస్టర్ ప్లాన్ ప్రకారం చుట్టూ ప్రాకారాలు నిర్మించడానికి స్థల సేకరణ ఎంతో అవసరమని అన్నారు. నిధులు విడుదల చేసినా ఎందుకు ఆలస్యం అవుతుందంటూ వివరణ కోరారు. ఈ నేపథ్యంలో భూసేకరణలో రెవెన్యూ శాఖ అధికారులు స్పీడ్ పెంచారు.