కిచెన్‌లో వాడే ఐటమ్స్ ఎంత క్వాలిటీవి అయినా, ఎంత శుభ్రంగా ఉన్నా కూడా కొన్ని తెలియకుండానే హాని చేస్తాయి. ముఖ్యంగా ఇమ్యూనిటీని తగ్గిస్తాయి . ఈ ‘కరోనా’ పరిస్థితుల్లో ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడం చాలా అవసరం. కానీ, దాదాపు కిచెన్‌లో వాడుతున్న కొన్ని ఐటమ్స్‌తో ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోయే ఛాన్స్ ఉందంటున్నారు ఎక్స్‌పర్ట్స్. మన కిచెన్‌లో కూడా అలాంటి ఐటమ్స్ ఉన్నాయేమో ఒక లుక్కేద్దాం!
నాన్-స్టిక్ కుక్‌వేర్
ఈ రోజుల్లో దాదాపు ప్రతి ఇంట్లోనూ ‘నాన్–స్టిక్ కుక్‌వేర్’ కామన్ అయిపోయింది. వీటివల్ల హెల్త్ పాడయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నా, ఎక్కువ మంది వీటిపైనే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వీటిని ‘పాలీటెట్రా ఫ్లోరో ఇథిలీన్’ అనే కెమికల్‌తో తయారు చేస్తారు. ఫ్లోరిన్, కార్బన్ అణువులతో తయారయ్యే దీన్నే ‘టెఫ్లాన్’ అంటారు. ‘పర్‌ఫ్లూరో ఆక్టానాయిక్ యాసిడ్’ (పీఎఫ్‌ఓఏ) వంటి కొన్ని కెమికల్స్‌ను కూడా దీని తయారీలో వాడతారు. త్వరగా తుప్పుపట్టకుండా, వాటర్‌ప్రూఫ్‌గా ఉండేందుకు ఇవి పనిచేస్తాయి. అయితే హానికరమైన ఈ కెమికల్స్ థైరాయిడ్ హార్మోన్ పెరిగేలా చేస్తాయి. వ్యాధి నిరోధక శక్తిపైనా ప్రభావం చూపిస్తాయి. దీంతో ఇమ్యూనిటీ తగ్గే ఛాన్స్ ఉంది. ఒకవేళ ‘నాన్–స్టిక్ కుక్‌వేర్’ వాడాలనుకుంటే ‘పీఓఎఫ్‌ఏ ఫ్రీ’ కుక్‌వేర్ వాడాలి.
అల్యూమినియం
ప్రతి కిచెన్‌లో ‘అల్యూమినియం’ వంటపాత్రలు చాలా ఉంటాయి. వీటిలో ఏ వంట వండుకున్నా, ఒకటి నుంచి రెండు మిల్లీ గ్రాముల వరకు అల్యూమినియం ఫుడ్‌లోకి చేరుతుంది. ఆ ఫుడ్ తినడం వల్ల బాడీలోకి చేరిన అల్యూమినియం, అనేక హెల్త్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. ఫుడ్‌లోని మినరల్స్, విటమిన్స్ శరీరానికి అందకుండా చేస్తుంది. ఛాతి సంబంధ సమస్యలకు దారితీస్తుంది. ఎక్కువ స్థాయిలో అల్యూమినియం బాడీలో పేరుకుపోతే కిడ్నీ సమస్యలు, బ్రెయిన్, బోన్ డిజార్డర్స్ వస్తాయి. దీనివల్ల ఇమ్యూనిటీ తగ్గుతుంది.
చాపింగ్ బోర్డ్స్
రోజూ వాడే ‘చాపింగ్ బోర్డ్స్’ కూడా వ్యాధులను కలిగించేందుకు కారణమవ్వొచ్చు. ప్లాస్టిక్ లేదా ఉడెన్ చాపింగ్ బోర్డ్ ఏదైనా సరే, వాటి సర్ఫేస్‌పై చిన్న రంధ్రాల్లాగా ఉంటాయి. వాటిలో హానికర బ్యాక్టీరియా చేరే ఛాన్స్ ఉంది. మాంసం ఆ బోర్డ్‌పై ఉంచి కట్ చేసినప్పుడు, అందులోంచి కారే రసాల ద్వారా బ్యాక్టీరియా బోర్డ్‌పైకి చేరుకుంటుంది. అది అక్కడే నిల్వ ఉంటుంది. ఆ బోర్డ్‌పై వెజిటబుల్స్, ఫ్రూట్స్ వంటివి కట్ చేసినప్పుడు బ్యాక్టీరియా వాటికి అంటుకుంటుంది. ఆ ఫుడ్ తింటే బ్యాక్టీరియా వల్ల హెల్త్ పాడవ్వొచ్చు. ఇమ్యూనిటీ తగ్గొచ్చు. అందుకే వెజిటబుల్స్‌కు, నాన్–వెజ్ ఐటమ్స్‌కు వేరువేరు చాపింగ్ బోర్డ్స్ వాడాలి. అది కూడా చిన్న రంధ్రాల్లాంటివి లేని, నునుపుగా ఉండే వాటినే వాడాలి. అందులోనూ ప్లాస్టిక్ చాపింగ్ బోర్డ్స్ అస్సలు వాడకపోవడమే మంచిది. వీటిపై ఉంచి ఫుడ్ ఐటమ్స్ కట్ చేస్తుంటే, కొద్దికొద్దిగా ప్లాస్టిక్ ఫుడ్‌లో కలుస్తుంది. ఇది కూడా లాంగ్‌టైమ్‌లో చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ తీసుకొస్తుంది.
పాలీ బ్యాగ్స్
మార్కెట్‌కు వెళ్లి చాలామంది పాలీబ్యాగ్స్ (పాలిథీన్ కవర్స్)లో కూరగాయలు, ఇతర సరుకులు తెస్తుంటారు. బయటి నుంచి తేగానే, వాటిని అదే కవర్లలో అలాగే ఉంచేస్తారు. కొన్నిసార్లు ఫ్రిజ్‌లో కూడా అలాగే పెడుతుంటారు. ఎక్కువసేపు ఫుడ్ ‘పాలీబ్యాగ్స్’లోనే ఉంటే, అందులోని హానికర కెమికల్స్ ఫుడ్‌లో కలిసిపోతాయి. దీనివల్ల జెనెటిక్ డ్యామేజ్ జరుగుతుంది. టిష్యూ, హార్మోనల్ ఛేంజెస్ వస్తాయి. ఫలితంగా ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతింటుంది. అందుకే వీటి బదులు బ్రౌన్ పేపర్ బ్యాగ్స్, క్లాత్ బ్యాగ్స్ వాడాలి.
బీపీఏ ప్లాస్టిక్ కంటైనర్స్
చాలా రకాల ఫుడ్ ఐటమ్స్‌ను ఎక్కువ మంది ‘బీపీఏ ప్లాస్టిక్ కంటైనర్స్’లోనే స్టోర్ చేస్తుంటారు. అయితే ఇది మంచి పద్ధతి కాదు. ఫుడ్‌ను వీటిలో స్టోర్ చేయకూడదు. వేడిగా ఉండే పదార్థాల్ని ‘బీపీఏ ప్లాస్టిక్ డబ్బా’ల్లో అస్సలు ఉంచకూడదు. ఫ్లెక్సిబుల్‌గా, దృఢంగా ఉండేందుకు వీటిలో చాలారకాల హానికర కెమికల్స్ కలుపుతారు. వీటిల్లో ఎక్కువ రోజులు ఫుడ్ ఐటమ్స్ ఉన్నా, వేడి పదార్థాలు ఉంచినా అందులోని కెమికల్స్ ఫుడ్‌లో కలిసిపోతాయి. ఈ ఫుడ్ తింటే బ్రెయిన్, ప్రొస్టేట్ గ్రంథులు వంటివి దెబ్బతింటాయి. దీనివల్ల వ్యాధి నిరోధక శక్తి కూడా తగ్గుతుంది. అందుకే ప్లాస్టిక్ వాడాల్సి వస్తే ‘బీపీఏ ఫ్రీ కంటైనర్స్’ వాడాలి. లేదంటే స్టీల్ డబ్బాలు బెటర్.
