ఇండ్ల అమ్మకాలు పెరిగినయ్​

ఇండ్ల అమ్మకాలు పెరిగినయ్​

న్యూఢిల్లీ : ఏప్రిల్​–జూన్ 2021​ మధ్య కాలంలో దేశంలోని ఏడు ప్రధాన సిటీలలో ఇండ్ల అమ్మకాలు అంతకు ముందు ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 93 శాతం పెరిగాయి. కాకపోతే, జనవరి–మార్చి క్వార్టర్​తో పోలిస్తే మాత్రం ఈ అమ్మకాలు 58 శాతం పడిపోయాయి. కరోనా సెకండ్​వేవ్​ ఎఫెక్ట్​తో తాజా క్వార్టర్లో సేల్స్​ తగ్గాయని ప్రోపర్టీ కన్సల్టెంట్​ అనరాక్​  వెల్లడించింది. ఢిల్లీ–ఎన్​సీఆర్​, ముంబై మెట్రోపాలిటన్​ రీజియన్​ (ఎంఎంఆర్), చెన్నై, కోల్​కత, బెంగళూరు, హైదరాబాద్​, పుణె సిటీలలో మొత్తం 24,570 హౌసింగ్​ యూనిట్లు అమ్ముడయినట్లు తెలిపింది. కిందటేడాది ఏప్రిల్​–జూన్​ మధ్యలో  12,740 రెసిడెన్షియల్​ హౌసింగ్​ యూనిట్లు సేలవగా, ఈ ఏడాది మార్చితో ముగిసిన క్వార్టర్లో 58,290 హౌసింగ్​ యూనిట్లు అమ్ముడుపోయాయని అనరాక్​ ఈ రిపోర్టులో పేర్కొంది. ఈ క్వార్టర్​ ఇంకా పూర్తవడానికి వారం రోజులుండగానే అనరాక్​ ఈ డేటాను ప్రకటించింది. అయితే, డేటా ముందుగా ఎందుకు రిలీజ్​ చేసిందో మాత్రం అనరాక్​ వెల్లడించలేదు. సాధారణంగా క్వార్టర్​ ముగిశాక ప్రాప్​టైగర్​, నైట్​ ఫ్రాంక్​ ఇండియా, ప్రాప్​ఈక్విటీ, జేఎల్​ఎల్​ ఇండియాలు తమ డేటాను విడుదల చేస్తున్నాయి. 

ఏడు మేజర్​ సిటీలలోనూ రెసిడెన్షియల్​ హౌసింగ్​ యూనిట్ల అమ్మకాలపై కరోనా సెకండ్​వేవ్​ ఎఫెక్ట్​ పడిందని అనరాక్​ చైర్మన్​ అనుజ్​ పురి చెప్పారు. అంతకు ముందు క్వార్టర్​తో పోలిస్తే అమ్మకాలు బాగా తగ్గాయని పేర్కొన్నారు. కిందటేడాది ఏప్రిల్​–జూన్​ మధ్యలో అమ్మకాలతో పోలిస్తే మాత్రం తాజా క్వార్టర్లో సేల్స్​ చాలా మెరుగ్గా ఉన్నాయన్నారు. అంతకు ముందు ఏడాది నేషనల్​ లాక్​డౌన్​లాగా ఈ ఏడాది లోకల్​ లాక్​డౌన్లు ఎక్కువ  ప్రభావం చూపించలేదన్నారు. వ్యాక్సినేషన్​ ఊపందుకోవడంతో చాలా రాష్ట్రాలలో రెస్ట్రిక్షన్లు తొలగిపోతున్నాయని, దీంతో ఇండ్ల అమ్మకాలు జులై–సెప్టెంబర్​ క్వార్టర్లో  మళ్లీ జోరందుకుంటాయని పురి చెప్పారు. గతంలో ఇళ్లు కొన్నవారు ఇప్పుడు పెద్ద ఇళ్లు కావాలనుకుంటున్నారని, మిలినియల్స్​ ఇళ్ల కొనుగోళ్లలో చాలా యాక్టివ్​గా ఉంటున్నారని పురి వెల్లడించారు. 

ఎంఎంఆర్​లో రెండు రెట్లు పెరిగాయ్​...

ఏప్రిల్​–జూన్​ 2021 క్వార్టర్లో ముంబైలో హౌసింగ్​ సేల్స్​ ఏకంగా రెండు రెట్లు పెరిగి 7,400 యూనిట్లకు చేరాయి. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో ఈ అమ్మకాలు 3,620 యూనిట్లే. పుణెలో తాజా క్వార్టర్లో అమ్మకాలు 3,790 యూనిట్లు. ఇక ఢిల్లీ ఎన్​సీఆర్​లో సేల్స్​ 65 శాతం పెరిగి 3,470 యూనిట్లకు చేరుకున్నాయి.  బెంగళూరులో ఇండ్ల అమ్మకాలు 19 శాతం పెరిగి 3,560 యూనిట్లకు చేరినట్లు రిపోర్టు తెలిపింది. 

హైదరాబాద్​లో భారీ జంప్​....

మన హైదరాబాద్​లో ఏప్రిల్​–జూన్​ మధ్య కాలంలో ఇండ్ల అమ్మకాలు ఏకంగా 3,240 యూనిట్లకు పెరిగాయి. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో ఈ సేల్స్​ 660 యూనిట్లు మాత్రమే.  మార్చి 2021 క్వార్టర్​తో పోలిస్తే మాత్రం ఇండ్ల అమ్మకాలు 26 శాతం తగ్గుతాయని అనరాక్​ రిపోర్టు వెల్లడిస్తోంది. మార్చి 2021 క్వార్టర్లో హైదరాబాద్​లో 4,400 ఇండ్లు అమ్ముడుపోయాయి.

అన్​సోల్డ్​ ఇన్వెంటరీ 2 శాతం పెరగొచ్చు...

ఏడు సిటీలలోనూ కలిపి అన్​సోల్డ్​ ఇన్వెంటరీ (అమ్ముడుపోని ఇండ్లు) తాజా క్వార్టర్లో 2 శాతం పెరగొచ్చని అనరాక్​ అంచనా వేస్తోంది. ఈ క్వార్టర్లో సప్లయ్​ పెరగడమే దీనికి కారణమని పేర్కొంది. కరోనా సెకండ్​వేవ్​ ఎఫెక్ట్​తో ఈ సిటీలలో రెసిడెన్షియల్​ ప్రోపర్టీల రేట్లు మాత్రం నిలకడగానే ఉన్నాయని అనరాక్​ రిపోర్టు తెలిపింది. ఏడాది ప్రాతిపదికన చూస్తే ఈ పెరుగుదల బెంగళూరు, ఎన్​సీఆర్​లో 2 % ఉంటే, ఎంఎంఆర్​, పుణె, హైదరాబాద్, చెన్నైలలో ఒక శాతం ఉందని తెలిపింది.