తెలంగాణది ఓదారి, ఆ ఇద్దరు నేతలది ఇంకో దారి

 కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తి చేసుకోనున్న సందర్భంగా ముఖ్యమంత్రి  ఆయన మంత్రివర్గ  సహచరులు  ప్రజాపాలన వేగవంతంపై దృష్టి కేంద్రీకరించారు. చిత్తశుద్ధితో తామిచ్చిన హామీలను నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నారు.  కొన్ని విషయాలలో అనేక సాంకేతిక సమస్యల వలన లబ్ధిదారులకు ఫలాలు కొందరికి అందాయి. ఈ నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్,  సీనియర్ నాయకుడు హరీష్ రావులు ఇద్దరు ప్రభుత్వంపై  రోజూ  తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.  

వీరిద్దరూ  ఒకవైపు  మొత్తం  తెలంగాణ  సమాజమంతా  మరోవైపు  నిలబడి చోద్యాన్ని చూస్తున్నది.  ఇద్దరు నాయకుల తీరును,  ప్రవర్తనను చూస్తుంటే  నాకు జనసామాన్యంలో ఉన్న ఉర్దూ సామెత  ‘సాలే భౌనేల ఏక్ తరఫ్​.. సారే దునియా ఏక్ తరఫ్’  మననంలోకి  చిత్రంగా వచ్చినది.  వీళ్ళిద్దరూ బావ బామ్మర్దులు కావడం,  నాయకత్వం కోసం పోటీపడడం అందరికీ తెలిసినదే.  తూ కిత్తా  అంటే  మై కిత్తా అంటూ  ఇద్దరూ ఎక్స్ వేదికగా మీడియా ముఖంగా  కేవలం ముఖ్యమంత్రిపైన విమర్శల దాడి చేస్తున్నారు. వీళ్ళ తీరు గమనిస్తుంటే ఉన్నపళంగా ముఖ్యమంత్రి కుర్చీని లాక్కునే  యోచనలా గోచరిస్తున్నది.

కేటీఆర్,  హరీష్​ల ఊకదంపుడు ఆరోపణలు

అసలు వీరికి తెలియాల్సింది చూపుడువేలుతో  ఇతరులను చూపిస్తే  మిగతా నాలుగువేళ్లు తమవైపు చూపిస్తాయని..ఇది తెలియకపోవడం హాస్యాన్ని తెప్పిస్తున్నది.  రాజకీయ వర్గాలకు,  మీడియా  విలేకరులకు తగినంత వినోదాన్ని  పంచి పెడుతున్నారు.  కేటీఆర్  ఊ  అంటే  కాంగ్రెస్  ​ప్రభుత్వ పరిపాలనపై  ఫిర్యాదులు, ఆరోపణలు  చేస్తుంటాడు.  వీరు  పది సంవత్సరాల్లో  వెలగబెట్టిన  పాలన అంతా  ప్రజావ్యతిరేకం.  కాబట్టి,  ప్రజలు ఎన్నికల్లో తిరస్కరించి అధికారానికి దూరం చేశారు.  దీంతో  ముఖ్యమంత్రిపై  తెల్లారి లేస్తే  ఊకదంపుడు ఆరోపణలు  చేస్తుంటాడు.  

ఇక హరీష్ రావు అయితే  ఆ హామీ నెరవేర్చలేదు,  ఈ  హామీ నెరవేర్చలేదని,  తెలంగాణను మోసం చేశారని ఒంటి కాలిపై  తమ పదేండ్ల కాలంలో  ఏదో ఉద్ధరించినట్టు ఇంత ఎత్తున లేస్తుంటాడు. అయితే, బావ బామ్మర్దులు ఒకవైపు ప్రభుత్వంపై  విమర్శలు చేస్తుంటే  తెలంగాణమంతా ఒకవైపు వేచి తరచి చూసే ధోరణి ప్రదర్శిస్తున్నది.  తెలంగాణ ఖజానాలో ఉన్నదెంతో,  ఊడ్చుకుపోయిందెంతో   వీరిద్దరికి  బాగా తెలుసు.   ముఖ్యమైన  హామీలు  ప్రభుత్వం చిత్తశుద్ధితో  నెరవేర్చుతున్నా,  హామీల అమలుపై  విమర్శలు ఎక్కుపెడుతుంటారు. ఏదో  తాము గత పది సంవత్సరాలలో ఎన్నో మేళ్లు ప్రజలకు  చేసినట్టు పెద్ద మాటలు మాట్లాడి  నీటిమూటలుగా  తేలిపోతుంటారు.

 
బీజేపీ, బీఆర్ఎస్​ ఒకటే..?

ముఖ్యంగా  ఇటీవల  కేటీఆర్  కాంట్రాక్టులపై  అవినీతి  ఆరోపణలు చేస్తూ  తాము  నిజాయితీకి  మారుపేరుగా నిలిచినట్టు మేకపోతు గాంభీర్యాన్ని  ప్రదర్శిస్తున్నాడు.  నీళ్లలో  వేలు పెడితే  వెన్న వస్తుందనుకుంటే  పొరపాటు.  పస లేకుండా తేలిపోతుంటారు వీరు.   వీళ్ళ  కుటుంబమంతా  సత్య హరిశ్చంద్రుని  వారసుల్లా  మాట్లాడుతుంటే  ప్రజలు ముక్కుమీద వేలు వేసుకుంటున్నారు.  కేసీఆర్  ప్రజలు  తమతో   విసిగిపోయారని  తెలిసినా.. ఫామ్ హౌస్  పంజరం  నుంచి 
బయటకు వచ్చి అప్పుడప్పుడు చిలుక పలుకులు,  ఫక్తు రాజకీయ సుభాషితాలు  పలుకుతుంటాడు.  వీరి కొంగ జపాలకు ఇక ప్రజలు మోసపోయే అవకాశాలు కనుచూపుమేరలో  కనిపించడం లేదు.  కేటీఆర్ అవినీతి  ఆరోపణలపై  దర్యాప్తునకు  గవర్నర్  అనుమతి  కోరగానే  పాహిమాం అంటూ ఢిల్లీ బీజేపీ నాయకుల వద్దకు పరుగులు తీశాడు. 

బీజేపీ ‘పతార’కు ప్రమాదం

ఒకవేళ  బీజేపీ... గవర్నర్ అభిప్రాయాన్ని ప్రభావితం  చేసి అనుమతి ఇవ్వకపోయినా ఎటూ  తేల్చలేకపోయినా  బీజేపీకి  తెలంగాణలో ఉన్న ఆ మాత్రం రాజకీయ ‘పతారకు’  పెద్ద దెబ్బ తగులుతుంది.  పైగా అధికారంలో  ఉన్న  కాంగ్రెస్  పార్టీ  నాయకత్వం  ఎలాగూ బీజేపీ,  బీఆర్ఎస్​ ఒకటే అనే దానికి మరింత బలాన్ని  చేకూర్చుతున్నట్టు అవుతుంది.  అయితే,   తెలంగాణలో  అసలు మొన్నటి  అసెంబ్లీ  పార్లమెంట్  ఎన్నికలలో  భారతీయ జనతా పార్టీ  అనేకానేక  కారణాల వల్ల  తన ఓట్ల శాతాన్ని  చట్టసభల్లో  సీట్ల సంఖ్యను  పెంచుకున్నది.  

ఈ విషయాన్ని  దృష్టిలో  ఉంచుకొని  రానున్న  ఎన్నికలలో  తెలంగాణలో  బీజేపీ  జెండా ఎగరవేస్తామని  ఆ పార్టీ  నాయకులు పలుకుతున్నారు.  ఇటువంటి  పరిస్థితుల్లో  కేటీఆర్  విచారణకు  గవర్నర్ అనుమతి  తెలంగాణ  ప్రభుత్వం ఇప్పటికే కోరినది.  ఇటువంటి  రాజకీయ  వాతావరణం  పరిస్థితుల్లో  ఒకవేళ  బీజేపీ సారథ్యంలోని  కేంద్ర నాయకత్వం విచారణ విషయంలో కలగజేసుకుంటే.. తెలంగాణ రాజకీయాలలో తమ ప్రభావాన్ని,  ప్రాముఖ్యతను  కోల్పోయే అవకాశాలు 
ఎక్కువగా ఉంటాయి. 

అడకత్తెరలో  పోకచెక్కలా  బీఆర్ఎస్​ నేతలు

కేసీఆర్,  హరీష్ రావు,  కేటీఆర్.. వీరి  కుటుంబం యావత్తు  పదేండ్ల  పాలనలో  తెలంగాణ  ఆర్థికంగా,  సామాజికంగా 300  సంవత్సరాల వెనుకకు పోయింది.  వీరి కుటుంబాలు  ఆర్థికంగా 400 సంవత్సరాలు ముందుకు పోయాయి.   బీఆర్ఎస్​  నాయకుల   మాటలు  అన్ని  కోటలు దాటినా  చేతలు గడప దాటవని అనేకసార్లు నిరూపించబడినది.  ఇప్పుడు  బీజేపీ  తెలంగాణలో వీరు చేసిన అవినీతి, అక్రమాల విచారణలను ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ అడ్డుకుని ప్రభావం చూపెడితే  బీజేపీకి తెలంగాణలో రాజకీయ సమాధికి పునాది పడ్డట్టు అవుతుంది. 

బీఆర్ఎస్​ పార్టీలోని  బావ బామ్మర్దులు తప్ప వారి పార్టీలోని మిగతా నాయకులు ఏ ఒక్కరూ కూడా వీరికి మద్దతుగా  మాట్లాడిన  ఉదాహరణలు కనిపించడం లేదు.  రాను రాను  రాజు గుర్రం గాడిద అయినట్టు  ఈ ఇద్దరు నాయకుల తీరు ఒకటైతే, ప్రపంచం పోకడ మరో తరీక.    తెలంగాణ  లోకమంతా  ఒక ఎత్తుగా విపరిణామం చెందుతున్నది. మారుతున్నది.  త్వరలో  కాంగ్రెస్  పన్నిన  రాజకీయ చక్రబంధంలో  బీఆర్ఎస్​ నాయకులు  అడకత్తెరలో  పోకచెక్కలా నలిగిపోనున్నారు.  బీజేపీ నాయకులు ఒకవైపు కులగణన,  మరోవైపు బీఆర్ఎస్​ నాయకుల రాజకీయ  చతురతను  ఎలా  అధిగమిస్తారో చూడాలి.  తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం విసిరిన బంతి ఇప్పుడు బీజేపీ, బీఆర్ఎస్​ నాయకుల  మధ్య  ఉన్నది.  రాబోయే రాజకీయ  పరిణామాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి. 

- జూకంటి జగన్నాథం, కవి, రచయిత-

  • Beta
Beta feature