బెంజ్‌‌కు దీపావళి బొనాంజా: ఒకేరోజు 600 లగ్జరీ కార్ల అమ్మకం

బెంజ్‌‌కు దీపావళి బొనాంజా: ఒకేరోజు 600 లగ్జరీ కార్ల అమ్మకం

న్యూఢిల్లీ:ఎకానమీ నెమ్మదించడం వల్ల అమ్మకాలు బాగా పడిపోయాయని ఆటో మొబైల్‌‌ కంపెనీలన్నీ మొత్తుకుంటుండగా, లగ్జరీ కార్ల కంపెనీ మెర్సిడెజ్‌‌ బెంజ్‌‌ మాత్రం ఖుషీగా ఉంది. బెంజ్‌‌ గత వారం ధంతేరాస్‌‌ నాడు ఏకంగా 600 లగ్జరీ కార్లు అమ్మిది. వీటిలో సగం ఢిల్లీ నుంచే అమ్ముడయ్యాయి. మిగతా వాటిని పంజాబ్‌‌, ముంబై, పుణే, కోల్‌‌కతా, గుజరాత్‌‌వాసులు కొన్నారని కంపెనీ తెలిపింది. ‘‘ఈసారి పండగ సీజన్‌‌ మాకు ఎంతో సంతోషం కలిగించింది. అన్ని రాష్ట్రాల మార్కెట్లలో మా కార్లు బాగా అమ్ముడయ్యాయి.

జీఎల్‌‌ఈ సిరీస్‌‌ వెహికిల్స్‌‌కు అద్భుతమైన స్పందన కనిపించింది. మూడు నెలల ముందుగానే మా టార్గెట్‌‌ను చేరుకున్నాం’’ అని మెర్సిడెజ్ బెంజ్‌‌ ఇండియా సీఈఓ, ఎండీ మార్టిన్‌‌ ష్వీంక్‌‌ అన్నారు. కస్టమర్లకు తమపై నమ్మకం పెరుగుతున్నదనడానికి ఈ అమ్మకాలే నిదర్శనమని చెప్పారు. దసరా సీజన్‌‌లోనూ బెంచ్‌‌ ముంబై, గుజరాత్‌‌లో 200 కార్లను విక్రయించింది. తదనంతరం జీఎల్‌‌ఈ ఎస్‌‌యూవీలకు బుకింగ్స్‌‌ మొదలుపెట్టింది. కొన్ని రోజుల్లోనే మొత్తం అమ్ముడవడంతో ‘నో స్టాక్‌‌’ బోర్డు పెట్టింది. వచ్చే ఏడాది జీఎల్‌‌ఈ కొత్త వెర్షన్‌‌ను అందుబాటులోకి తీసుకువస్తామని కంపెనీ తెలిపింది.

మరిన్ని వెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి