కొట్టేసిన బస్ షెల్టర్ మిస్టరీ వీడింది

కొట్టేసిన బస్ షెల్టర్ మిస్టరీ వీడింది

కర్ణాటక రాజధాని బెంగుళూరులో బస్ షెల్టర్ చోరీ కేసు మిస్టరీ వీడింది. ఆ బస్ షెల్టర్ దొంగతనం కాలేదని..నాణ్యత లేకుండా నిర్మించడం వల్ల స్థానిక అధికారులే దాన్ని తరలించారని పోలీసులు విచారణలో తేలింది. అంతేకాకుండా నాణ్యత లేకుండా బస్ స్టాప్ ను నిర్మించిన కంపెనీపై పోలీసులు కేసు నమోదు చేయడం గమనార్హం. 

బస్ షెల్టర్ చోరీ..

బెంగుళూరులోని కన్నింగ్​హామ్ రోడ్లో బస్​షెల్టర్ నిర్మాణానికి సైన్​బోర్డ్ అనే కంపెనీకి నగర మున్సిపల్  కార్పొరేషన్ అనుమతి ఇచ్చింది. ఆగస్టు 21న రూ.10లక్షల విలువైన బస్ షెల్టర్ను నిర్మించినట్లు కంపెనీ పేర్కొంది. అయితే ఆగస్టు 27 ఈ బస్ షెల్టర్ను  పరిశీలించేందుకు కంపెనీ ప్రతినిధులు రాగా.... అది కనిపించలేదు. బెంగుళూరు మున్సిపల్ అధికారులను సంప్రదించారు. అయితే, బస్ షెల్టర్ను తాము తరలించలేదని అధికారులు చెప్పడంతో  కంపెనీ ప్రతినిధులు  పోలీసులకు ఫిర్యాదు చేసింది. సెప్టెంబర్‌ 30న కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టడంతో  అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ బస్ షెల్టర్ను కేవలం రూ. 3 లక్షలతో నిర్మించినట్లు తేలింది. 

ఈ బస్ షెల్టర్ను నాణ్యత లేకుండా నిర్మించారంటూ ఫిర్యాదు రావడంతో దాన్ని అక్కడి నుంచి గోడౌన్కు తరలించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ విషయం తెలియని నిర్మాణ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే  నాణ్యత లేకుండా నిర్మించారంటూ నిర్మాణ కంపెనీపై తిరిగి కేసు నమోదు చేశారు.