ఆశకైనా హద్దు ఉండాలి.. అత్యాశకు పోతే ఉన్నది కూడా పోతుంది. తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించొచ్చనే ఆశతో ఉన్నది పోగొట్టుకుంటున్నారు నేటి యువత. డిజిటల్ కరెన్సీ బిట్ కాయిన్లపై పెట్టుబడి పెట్టి అధిక లాభం పొందవచ్చని ఆశతో భారీగా మోసపోతున్నారు ఈ మధ్య. డబ్బు ఆశ చూపి సైబర్ నేరగాళ్లు కుచ్చుటోపీ పెడుతున్నారు. బిట్ కాయిన్లపై పెట్టుబడితే దండిగా లాభాలు వస్తాయని చెప్పి జేబులు గుళ్ల చేస్తున్నారు. రెండు కోట్లు వస్తాయని బెంగుళూరులో కోటి రూపాయలు పోగోట్టుకున్నాడో ఓ ఇంజినీర్. నిండా మునిగాక పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు.
అసలేం జరిగిందంటే.. బెంగళూరులో శాంతి నగర్ కు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కు రెండేళ్ల క్రితం సోషల్ మీడియా ద్వారా పరిచయం అయింది ఓ మహిళ. ఇంజినీర్ కు సోనియా షెనాయ్ గా పరిచయం అయిన ఆ మహిళ బిట్ కాయిన్ లలో పెట్టుబడి పెట్టేలా చేసింది. తాను ఇంతకు ముందు బిట్ కాయిన్ వ్యాపారంలో మల్టీ నేషనల్ కంపెనీలలో పనిచేశానని నమ్మించింది. బిట్ కాయిన్లలో పెట్టుబడి భారీగా లాభాలు వస్తాయని చెప్పింది.
ఇంజినీర్ జనవరి 2022- 2023 మధ్య బిట్‌కాయిన్‌లలో మొత్తం రూ.95 లక్షలు పెట్టుబడి పెట్టాడు. జులైలో ఇంజనీర్ కు ఫోన్ చేసిన మహిళ.. నీకు 2 కోట్ల లాభం వస్తుంది కానీ నువ్వు టీడీఎస్ కి రూ. 50 లక్షలు చెల్లించాలని చెప్పింది. దీంతో అతడు పలు బ్యాంకుల్లో అప్పుచేసి రూ.50 లక్షలు కట్టాడు. అయితే 2 కోట్లు రాకపోయే సరికి తాను మోసపోయానని గ్రహించి ఆ ఇంజినీర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బెంగళూరులో బిట్ కాయిన్ లలో పెట్టుబడి పెట్టి మోసపోయిన ఘటనలు ఇదేం తొలిసారి కాదు.
