కోల్‌కతా:బెంగాల్ అసెంబ్లీ సమావేశాల తొలిరోజే రభస జరిగింది. గవర్నర్ జగదీప్ ధన్‌కర్ ప్రసంగిస్తుండగా.. బీజేపీ ఎమ్మెల్యేలు పదేపదే అడ్డుతగిలారు. మొన్నటి
అసెంబ్లీ ఎన్నికల తర్వాత చెలరేగిన హింసకు సంబంధించిన ఫొటోలు, ప్లకార్డులు ప్రదర్శించారు. జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. దీంతో గవర్నర్ తన ప్రసంగాన్ని మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయారు.కొత్తగా ఎన్నికైన సభ్యులతో అసెంబ్లీ శుక్రవారం సమావేశమైంది. ఆ వెంటనే గవర్నర్ ప్రసంగించడం మొదలుపెట్టారు. ‘‘శాంతి భద్రతల అంశం ఎన్నికల కమిషన్ పరిధిలో ఉన్న సమయంలోనే హింస చెలరేగింది. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక పరిస్థితి చక్కబడింది” అని ఆయన తన ప్రసంగంలో చెప్పారు. దీనిపై బీజేపీ అభ్యంతరం వ్యక్తంచేసింది. నిరసనలకు దిగింది. ఈ సందర్భంగా సభలో ప్రతిపక్ష నేత సువేందు అధికారి మాట్లాడుతూ.. ‘‘రాష్ట్ర ప్రభుత్వం రాసిచ్చిన ప్రసంగాన్ని గవర్నర్ చదివారు. కానీ అందులో ఎన్నికల తర్వాత జరిగిన హింస గురించి ప్రస్తావించలేదు. మేం గవర్నర్‌ను, ఆయన తీసుకున్న స్టాండ్‌ను గౌరవిస్తాం. ఎందుకంటే పోస్ట్ పోల్ వయలెన్స్‌పై ఆయన కూడా తన అసంతృప్తి వ్యక్తం చేశారు. కానీ స్పీచ్‌ను మమత కేబినెట్ రాసిచ్చింది. అందులో గవర్నర్ ప్రమేయం లేదు. హింసలో చనిపోయిన మా కార్యకర్తల డెడ్ బాడీల ఫొటోలతో నిరసన తెలిపాం” అని వివరించారు. నినాదాలు, ప్లకార్డుల ప్రదర్శనతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో 10 నిమిషాలు కూడా గడవకముందే గవర్నర్ తన ప్రసంగాన్ని ఆపేశారు. పూర్తిగా చదవకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు.
