అలంపూర్ లో షా- అలీ -పహిల్వాన్ ఉర్సు ప్రారంభం

  •     గంధోత్సవానికి భారీగా తరలివచ్చిన భక్తులు

అలంపూర్, వెలుగు: అలంపూర్ లోని షా- అలీ -పహిల్వాన్ ఉర్సు ఉత్సవాలు దర్గా చైర్మన్ సయ్యద్ షా అహ్మద్ ఉవైసీ ఖాద్రీ ఆధ్వర్యంలో గురువారం ప్రారంభమయ్యాయి.  కులమతాలకు అతీతంగా జరిగే ఈ ఉత్సవాలు జూన్ 2 వరకు కొనసాగనున్నాయి. భక్తులు అధిక సంఖ్యలో తరలిరానున్న నేపథ్యంలో ఆర్డీఓ రామచందర్ అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి ఏర్పాట్లపై దిశా నిర్దేశం చేశారు.

ఉత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి గంధోత్సవం నిర్వహించారు. సయ్యద్ ఖాదర్ వలీ సాహెబ్ ఇంటి నుంచి తహసీల్దార్ కార్యాలయానికి గంధం తీసుకెళ్లారు. అక్కడ ప్రత్యేక ప్రార్థనల అనంతరం సర్ ముబారక్ దర్గాకు ఊరేగింపుగా తీసుకెళ్లి సమర్పించారు. కార్యక్రమాన్ని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. చివరగా దడ్ ముబారక్ దర్గాకు గంధాన్ని తీసుకెళ్లి ప్రార్థనలు చేశారు. శుక్రవారం సర్ ముబారక్ దర్గాలో చిన్న కిస్తీలు నిర్వహిస్తారు. జూన్ 1న దడ్ ముబారక్ దర్గా వద్ద పెద్ద కిస్తీ నిర్వహిస్తారు. పెద్ద కిస్తీ పోటీలను తిలకించడానికి భక్తులు భారీగా తరలిరానున్నారు. జూన్ 2న మహిళల ప్రత్యేక ఉర్సుతో ఉత్సవాలు 
ముగియనున్నాయి.