జనవరి 1 నుంచి భిక్షాటన బంద్ .. నియంత్రణకు పోలీసులతో ప్రత్యేక టీమ్ లు

  • పునరావాస కేంద్రాలకు యాచకుల తరలింపు
  • చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీకి బాధ్యతలు
  • యాక్షన్ ప్లాన్ రూపొందించిన కలెక్టర్

నిర్మల్, వెలుగు: జనవరి 1 నుంచి నిర్మల్ జిల్లాలో భిక్షాటన పూర్తిగా నిషేధించబోతున్నారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా భిక్షాటన నిషేధ చట్టాన్ని కఠినంగా అమలు చేయనున్నారు. ఇందుకోసం కలెక్టర్ అభిలాష అభినవ్ ఆధ్వర్యంలో యాక్షన్ ప్లాన్ ను రూపొందించారు. చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ అధికారులు, సిబ్బందితో శనివారం కలెక్టర్ ప్రత్యేకంగా సమావేశమై యాక్షన్ ప్లాన్ అమలుపై చర్చించారు. 

ఫిర్యాదులతో చర్యలు

భిక్షాటన కారణంగా ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నట్లు అధికారులు గుర్తించారు. నిర్మల్ జిల్లా కేంద్రంతో పాటు భైంసా, ఖానాపూర్ పట్టణాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రధాన కూడళ్లు, దేవాలయాల్లో భిక్షాటన చేసే వారితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నిర్మల్ పట్టణంలోని మంచిర్యాల చౌరస్తా, కొత్త బస్టాండ్, శాంతినగర్ చౌరస్తా, ఈద్గాం చౌరస్తా తదితర ప్రాంతాలలో భిక్షాటన చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. వారితో కలుగుతున్న ఇబ్బందులపై కలెక్టర్​కు ఇప్పటికే పలు ఫిర్యాదులు అందాయి. వీటిపై స్పందించిన కలెక్టర్.. జిల్లాలో భిక్షాటనను పూర్తిగా నిషేధించాలని నిర్ణయించారు. దీనికనుగుణంగా చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ అధికారులకు బాధ్యతలు అప్పజెప్పారు. భిక్షాటనను ప్రోత్సహించే వారిపైనా కఠిన చర్యలు తీసుకోనున్నారు.

నైపుణ్యాభివృద్ధి శిక్షణ

జిల్లాలో భిక్షాటనను పూర్తిగా నిషేధించేందుకు కోసం పోలీసు శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేయబోతున్నారు. భిక్షాటన నిషేధ చట్టాన్ని జిల్లాలో కఠినంగా అమలు చేయనున్నారు. ఇందులో భాగంగా భిక్షాటన చేస్తూ జీవిస్తున్న వారందరినీ పునరావాస కేంద్రాలకు తరలించనున్నారు. మొదట ప్రధాన కూడళ్లలో భిక్షాటన చేస్తున్న వారందరినీ గుర్తించి వారికి అవగాహన కల్పించి, పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం, భోజన వసతి కల్పించనున్నారు. దీంతోపాటు వారందరికీ విద్యా అవకాశాలు కల్పించనున్నారు. స్వయం ఉపాధి కోసం నైపుణ్యాభివృద్ధిపై శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. భిక్షాటనను ప్రోత్సహించే వారికి కౌన్సిలింగ్ నిర్వహించడమే కాకుండా చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు. ఈ వ్యవహారంలో ప్రజల సహకారం కూడా తీసుకోవాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచించారు.