మళ్లీ రోడ్డెక్కిన బీచ్ పల్లి గురుకుల స్టూడెంట్స్

  •     ప్రిన్సిపాల్ వేధింపులు.. అక్రమాలకు పాల్పడుతున్నాడని బైఠాయించి నిరసన 
  •     పోలీసులు, అధికారులు  వెళ్లి నచ్చజెప్పడంతో ఆందోళన విరమణ

గద్వాల, వెలుగు : వేధింపులకు గురి చేస్తూ.. అక్రమాలకు పాల్పడుతున్న ప్రిన్సిపాల్ తమకు వద్దంటూ జోగుళాంబ గద్వాల జిల్లాలోని బీచుపల్లి గురుకుల స్కూల్ స్టూడెంట్స్ ఆందోళన చేశారు.  నేషనల్ హైవే – 44 పై  బైఠాయించి నిరసన తెలిపారు. పలువురు స్టూడెంట్స్ మాట్లాడుతూ నిత్యం స్కూల్ లో ప్రిన్సిపల్ శ్రీనివాసులు వేధింపులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.  

మెనూ ప్రకారం ఫుడ్ పెట్టకుండా, టార్చర్ చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రిన్సిపాల్ ను తొలగించాలని డిమాండ్ చేశారు. మరోవైపు ప్రిన్సిపాల్ వేధింపులు ఎక్కువైనట్టు వాపోయారు. గత నెల 25న ప్రిన్సిపాల్ ను మార్చాలని డిమాండ్ చేస్తూ గద్వాల కలెక్టరేట్ కు  20 కిలోమీటర్లు నడిచి వెళ్లి  కలెక్టర్ కు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని విద్యార్థులు  పేర్కొన్నారు. 

సమాచారం అందడంతో పోలీసులు, ఉన్నతాధికారులు వెళ్లి  స్టూడెంట్స్ కు నచ్చజెప్పారు.  ప్రిన్సిపాల్ పై చర్యలకు కొంత సమయం పడుతుందని చెప్పి నిరసన విరమింపచేశారు. అరగంట పాటు ధర్నా చేయగా ట్రాఫిక్ కు  అంతరాయం ఏర్పడగా  పోలీసులు  క్లియర్ చేశారు.