ఆరోగ్య శ్రీ కార్డు ఉంటే అకౌంట్‌లో డబ్బులు వేస్తామని ఫోన్లు వస్తున్నయ్..

ఆరోగ్య శ్రీ కార్డు ఉంటే అకౌంట్‌లో డబ్బులు వేస్తామని ఫోన్లు వస్తున్నయ్..
  • మోసగాళ్ల వలలో పడొద్దు.. బ్యాంకు వివరాలు చెప్పొద్దు
  • ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఆరోగ్య శ్రీ ట్రస్ట్ సీఈవో

ఆరోగ్య శ్రీ పేరుతో కొంత మంది దుండగులు ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ ఆరోగ్య శ్రీ ట్రస్ట్ సీఈవో డాక్టర్ మల్లికార్జున సూచించారు. ఆరోగ్య శ్రీ కార్డు ఉంటే అకౌంట్‌లో డబ్బులు వేస్తామని ఫోన్లు చేస్తున్నారని, అలాంటి వారికి బ్యాంకు వివరాలు చెప్పి మోసపోవద్దని చెప్పారు. మోసగాళ్ల వలలో పడకుండా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘ఈ మధ్య కొందరు మోసగాళ్లు ప్రజలకు ఫోన్లు చేసి మీకు ఆరోగ్యశ్రీ కార్డు ఉందా, ప్రభుత్వం నుంచి మీ అకౌంట్‌కి కొంత డబ్బు పంపుతాం. మీ అకౌంట్‌లో ప్రస్తుతం ఎంత డబ్బు ఉంది? మీ డెబిట్ కార్డు లేక క్రెడిట్ కార్డు నెంబర్ చెప్పండి, సీవీవీ నంబర్ చెప్పండి, ఓటీపీ చెప్పండి అని అడుగుతున్నారని మా దృష్టికి వచ్చింది’’ అని తెలిపారు ఆరోగ్య శ్రీ ట్రస్ట్ సీఈవో. దీనికి సంబంధించి ఒక వీడియో క్లిప్పింగ్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోందన్నారు. ఆ వీడియోతో ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్‌కి ఎటువంటి సంబంధమూ లేదని వివరించారు. ఆరోగ్యశ్రీ ఆఫీసు వాళ్లు ఎప్పుడూ లబ్ధిదారుల బ్యాంకు వివరాలు, ఓటీపీ, సీవీవీ నంబర్లు వంటివి అడగరని చెప్పారు మల్లికార్జున. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అటువంటి మోసగాళ్ల వలలో పడి మోసపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.