పూజారులుగా బీసీలు, ఎస్సీలు

పూజారులుగా బీసీలు, ఎస్సీలు
  • 58 మందిని నియమించిన తమిళనాడు ప్రభుత్వం.. ఒక మహిళకు అవకాశం 

చెన్నై: ఎప్పటిదో ఆ పోరాటం.. ఇప్పుడు గెలిచింది. బడుగుబలహీన వర్గాల వారిని గుళ్లలో పూజారులుగా నియమించాలన్న దశాబ్దాల నాటి డిమాండ్​ ఇప్పుడు తీరింది. బీసీలు, ఎస్సీలను అర్చకులుగా నియమిస్తూ తమిళనాడు ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. స్వాతంత్ర్య దినోత్సవానికి ఒక్కరోజు ముందు బ్రాహ్మణులు కాని 58 మందిని పూజారులుగా నియమించింది. అందులో ఒక మహిళ కూడా ఉన్నారు. ఆమె పేరు సుహంజన గోపీనాథ్​. ఈ నియామకంతో తమిళనాడులో రెండో మహిళా పూజారిగా ఆమె రికార్డులకెక్కారు. ప్రస్తుతం ఆమెను చెన్నైలోని ధేనూపురీశ్వర్​ ఆలయంలో పూజారిగా నియమించారు. ఒడియార్​ (శైవం) వర్గం కింద ఆమెకు శిక్షణనిచ్చారు. అంతకుముందు పిన్నియక్కళ్​ అనే మహిళ తన తండ్రి చనిపోవడంతో వారసత్వంగా అర్చకత్వం చేశారు. దీంతో తమిళనాడులో తొలి మహిళా పూజారిగా నిలిచారు. అయితే, పూజారిగా ఆమెను ఎవరూ అంగీకరించకపోవడంతో కోర్టుకెళ్లి విజయం సాధించారు.
ఐదుగురు ఎస్సీలు..
ఆ 58 మందిలో 24 మంది ప్రభుత్వ అర్చక శిక్షణ పాఠశాలల్లో చదువుకోగా.. 34 మంది ప్రైవేట్​ సంస్థల్లో శిక్షణ తీసుకున్నారు. ప్రభుత్వ సంస్థలో శిక్షణ పొంది.. అపాయింట్​మెంట్​ అందుకున్నోళ్లలో ఐదుగురు ఎస్సీలున్నారు. ఆరుగురు అత్యంత వెనుకబడిన కులస్థులు కాగా.. 12 మంది బీసీలున్నారు. ఒకరు జనరల్​ కేటగిరీకి చెందిన వారు. వారితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గుళ్లలో పనిచేసేందుకుగానూ 138 మందిని నియమించారు. 
ఇదీ చరిత్ర...
    1934 ఆగస్టు 8: ఆత్మగౌరవ ఉద్యమంలో భాగంగా అన్ని కులాలకు చెందిన వారిని పూజారులుగా నియమించాలంటూ ఈవీ రామస్వామి పెరియార్​ డిమాండ్​ చేశారు. 
    1969: ద్రవిడర్​ కళగం నేత అయిన పెరియార్​.. తొలిసారి నిరసనలకు పిలుపునిచ్చారు. 
    1970: నాటి ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి తమిళనాడు హిందూ రెలిజియస్​ ఎండోమెంట్​ చట్టాల్లో సవరణలు చేశారు. అర్చకత్వంలో వారసత్వ నియామకాలన్నింటినీ రద్దు చేశారు. అన్ని కులాలకు చెందిన వారిని పూజారులుగా నియమిస్తూ ఓ కొత్త చట్టాన్ని తెచ్చారు. 
    1972:కొత్త చట్టాన్ని సుప్రీంకోర్టు నిలిపేసింది. 
    1982: ఆ కొత్త చట్టం, ఆలయాల్లో సంస్కరణల కోసం నాటి సీఎం ఎంజీ రామచంద్రన్​.. మహారాజన్​ కమిటీని ఏర్పాటు చేశారు. 
    2006: అన్ని కులాల వారికీ అర్చక శిక్షణను ఇచ్చేందుకు శిక్షణ కేంద్రాలు, స్కూళ్ల ఏర్పాటు కోసం జీవోను పాస్​ చేశారు. అదే ఏడాది సుప్రీంకోర్టు దానిపై స్టే విధించింది. 
    2016 డిసెంబర్: పుట్టుక లేదా కులం ఆధారంగా గుళ్లలో పూజారుల నియామకాన్ని చేపట్టరాదంటూ సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. 
    2017: సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా కేరళ రాష్ట్ర ప్రభుత్వం.. వేరే కులాలకు చెందిన 62 మందిని పూజారులుగా నియమించింది.