నేటికీ రాజకీయ అంటరానితనంలోనే బీసీలు.. బీసీల మేధోమథన సదస్సులో వక్తలు

  • చట్టసభల్లో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఉండాలి: వక్తలు
  • సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో బీసీల మేధోమథన సదస్సు
  • స్వతంత్ర రాజకీయ వేదిక ఏర్పాటు చేయాలని నిర్ణయం
  • రాజకీయ సిద్ధాంత భావజాలాన్ని గ్రామాల్లోకి తీసుకెళ్లాలని తీర్మానం

హైదరాబాద్​ సిటీ, వెలుగు: 75 ఏండ్ల స్వాతంత్య్రం, రాజ్యాంగం అమలు అనంతరం కూడా బీసీలు ప్రజా ప్రాతినిథ్యాన్ని సమానత్వంగా సాధించని కారణంగా రాజకీయ అంటరానితనంలోనే ఉన్నారని వక్తలు అభిప్రాయపడ్డారు. బీసీలకు చట్ట సభల్లో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించకుండా, రాజకీయ ప్రాతినిథ్యం సాధించకుండా సమాజంలో అసమానతలు తొలగిపోవడం అసాధ్యమని పేర్కొన్నారు.  బీసీ వర్గాలను ఎంతసేపూ ఓట్లేసే యంత్రాలుగా, సంక్షేమ పథకాల లబ్ధిదారులుగానే పరిమితం చేస్తుండడంతో సమాజంలో తీరని హెచ్చుతగ్గులు ఏర్పడ్డాయని విచారం వ్యక్తం చేశారు.

శనివారం నగరంలోని సోమాజిగూడ ప్రెస్‌‌‌‌‌‌‌‌క్లబ్‌‌‌‌‌‌‌‌లో ‘‘75 ఏండ్ల భారత రాజ్యాంగం– రాజకీయ అంటరానితనంలో బీసీలు’’ అనే అంశంపై మేధోమథన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర బీసీ కమిషన్‌‌‌‌‌‌‌‌ మాజీ చైర్మన్‌‌‌‌‌‌‌‌, జాతీయ సామాజిక న్యాయవేదిక సమన్వయకర్త  వకుళాభరణం కృష్ణమోహన్‌‌‌‌‌‌‌‌రావు అధ్యక్షత వహించారు. ఆచార్య కె.మురళీమనోహర్‌‌‌‌‌‌‌‌, సామాజిక తత్వవేత్త బి.ఎస్‌‌‌‌‌‌‌‌.రాములు కీలక ఉపన్యాసాలు చేశారు. కార్యక్రమ సమన్వయకర్తలుగా దేవళ్ల సమ్మయ్య, కొట్టె సతీశ్​ వ్యవహరించారు. ఈ సందర్భంగా బీసీలను ఏకంచేసే విధంగా రాజకీయ సిద్ధాంత భావజాలాన్ని గ్రామ గ్రామానికి తీసుకెళ్లాలని ఏకగ్రీవంగా తీర్మానించారు.

దేశంలోని బిహార్‌‌‌‌‌‌‌‌, యూపీ, కర్నాటక, తమిళనాడు, తదితర రాష్ట్రాల్లో బీసీలే పార్టీలు పెట్టుకొని రాజ్యాధికారాన్ని కైవసం చేసుకుంటున్నప్పుడు తెలంగాణలో కూడా అది ఎందుకు సాధ్యం కావడం లేదనే అంశంపై చర్చించారు. అధికారాన్ని కైవసం చేసుకునే దిశగా స్వతంత్ర రాజకీయ వేదికను ఏర్పాటు చేయాలని, వచ్చే ఎన్నికల నాటికి అధికారంలోకి వచ్చేలా కార్యాచరణను రూపొందించాలని, ప్రణాళికాబద్ధంగా ఉద్యమాలను నిర్మించాలని నిర్ణయించారు.ఈ కార్యక్రమంలో పి.ఎల్‌‌‌‌‌‌‌‌. విశ్వేశ్వరరావు,  డాక్టర్​ ఎస్‌‌‌‌‌‌‌‌.పృథ్వీరాజ్‌‌‌‌‌‌‌‌, ప్రొఫెసర్లు నరేంద్రబాబు, పార్థసారథి, భాస్కర్‌‌‌‌‌‌‌‌, సొగర బేగం, తదితరులుపాల్గొన్నారు. కాగా, అంతకుముందు మాజీ ప్రధాని మన్మోహన్​సింగ్​ మృతికి సంతాపం తెలిపారు.