కుల సంఘాలకు మీ సొంత జాగలు ఇచ్చారా?

  • మండలిలో బీఆర్ఎస్ సభ్యులపై పొన్నం ప్రభాకర్ ఫైర్
  • బిల్డింగ్స్ నిర్మాణానికి 95 కోట్లు కేటాయించి 10 కోట్లే ఇచ్చారు
  • బీసీ డిక్లరేషన్​లో చెప్పినట్టు రిజర్వేషన్లు కల్పిస్తామని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: కులసంఘాలకు.. మీ సొంత జాగాలు ఇచ్చారా.. ఫామ్ హౌజ్​లో నుంచి పంచి ఇచ్చారా అంటూ మండలిలో బీఆర్ఎస్ సభ్యులపై బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. కౌన్సిల్​లో ప్రతి జిల్లా కేంద్రాల్లో బీసీ కుల భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు ఉన్నాయా అనే అంశంపై బీఆర్ఎస్ సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా కుల భవనాల స్థలాలు మా ప్రభుత్వ హయాంలోనే ఇచ్చామన్న బీఆర్ఎస్ సభ్యులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. 

ఇచ్చింది తమ ఇంటి స్థలాలు.. సొంత భూములు కాదనీ.. ఏ స్థలం ఇచ్చినా ఎవరు ఇచ్చినా అది ప్రభుత్వ స్థలమేనని గుర్తు చేశారు. కుల భవనాల విషయంలో గత ప్రభుత్వం ఆర్భాటం చేసిందని విమర్శించారు. ఆత్మ గౌరవ భవనాలకు గత ప్రభుత్వం రూ.95 కోట్లు కేటాయించి కేవలం రూ.10 కోట్లు ఖర్చు చేసిందన్నారు. 42 ఆత్మ గౌరవ భవనాలకు భూములు కేటాయించి మౌలిక సదుపాయాలను ప్రభుత్వం మరిచిందని విమర్శించారు. బలహీన వర్గాలకు గత ప్రభుత్వం బడ్జెట్ లో రూ.8 వేల కోట్లు కేటాయించి రూ.2 వేల కోట్లు మంజూరు చేసిందనీ అందులో కేవలం రూ.800 కోట్లు ఖర్చు చేశారని తెలిపారు.

 జిల్లాల కేంద్రాలలో భవనాల నిర్మాణంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదనీ, గతంలో ఇచ్చినవే ఇంకా పెండింగ్ లో ఉన్నాయన్నారు. కుల భవనాల విషయంలో ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ లో ప్రకటించినట్టు బీసీ కులాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందనీ, డిక్లరేషన్ లో చెప్పినట్టు రిజర్వేషన్ కల్పిస్తామన్నారు. అందులో భాగంగానే  కులగణన చేస్తున్నామని వివరించారు.

బీఆర్ఎస్ నేతల కిరాయి బిల్డింగ్స్​లో గురుకులాలు నడిపారు

నాలుగు స్కూళ్లను కలిపి ఒకే చోట ఉండేలా కొత్తగా 54 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మీ హయంలో బీసీ గురుకులాలు సొంత భవనాల్లో నడపలేదు: బీఆర్ ఎస్ నేతల కిరాయి భవనాల్లో నడిపారు. ఆధారాలతో సహా వెల్లడిస్తామని మంత్రి పొన్నం అన్నారు. కొన్నాళ్లుగా అద్దె భవనాలకు కిరాయి ఇవ్వక తాళం వేస్తే 50శాతం చెల్లించామని ఈ సందర్భంగా మంత్రి పొన్నం గుర్తు చేశారు.