కుల గణనపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలి :  జాజుల శ్రీనివాస్ గౌడ్ 

  • బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ 

ముషీరాబాద్, వెలుగు: సమగ్ర కుల గణనపై శ్వేత పత్రం విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. ఇంటింటి సర్వే 98 శాతం పూర్తయిందని చెప్పి అధికారులు సీఎం రేవంత్ రెడ్డిని  తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. అలాంటివారిపై చర్యలు తీసుకొని కులగణ లోపాలను సవరించాలని కోరారు. సొంత ఇండ్లలో కొన్నింటిని మాత్రమే సర్వే చేసిన అధికారులు అద్దెకు ఉంటున్న వారి ఇండ్లకు వెళ్లి సర్వే చేయలేదని ఆరోపించారు.

శనివారం దోమల గూడ  బీసీ భవన్ లో బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి అధ్యక్షతన వివిధ బీసీ సంఘాల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. కుల గణనపై బిల్లు పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని తెలిపారు. కుల గణన పూర్తిస్థాయిలో జరిగిన తర్వాతే బిల్లు ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు. కులగణనలో లోపాలను ఎందుకు సవరించడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సమగ్ర కులగణన పూర్తిగా నిర్వహించిన తర్వాతనే ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు.సమావేశంలో బాలగోని బాలరాజు గౌడ్, కులకచర్ల శ్రీనివాస్, జాజుల లింగం గౌడ్, మల్లికార్జున్, తదితరులు పాల్గొన్నారు.