కాంట్రాక్టర్ల బిల్లులు కాదు.. ఫీజుల బకాయిలు చెల్లించండి

  • బీసీ నేత జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్

ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు నాలుగేండ్లుగా బకాయిపడ్డ ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.  బడా కాంట్రాక్టర్ల బిల్లులు ఆపి స్టూడెంట్ల ఫీజుల బకాయిలు చెల్లించాలని కోరారు.

లేకుంటే వేలాదిమంది విద్యార్థులతో రాష్ట్ర సచివాలయాన్ని దిగ్బంధిస్తామని హెచ్చరించారు. శుక్రవారం హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ ఆవరణలో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు గొడుగు మహేశ్ యాదవ్ అధ్యక్షతన జనవరి 8న జరిగే బీసీల సమర శంఖారావం వాల్ పోస్టర్ ను జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.."12 లక్షల మంది విద్యార్థులకు నాలుగేండ్లుగా ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్ లు విడుదల చేయలేదు. దీనివల్ల కోర్సు పూర్తి అయిన తర్వాత స్టూడెంట్లు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు పొందలేకపోతున్నారు. వెంటనే ఫీజుల బకాయిలు రూ. 4 వేల వేల కోట్లు విడుదల చేయాలి. ప్రైవేట్ వర్సిటీలలో బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు అమలు చేస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చాలి. బీసీ విద్యార్థుల మొత్తం పీజులను ప్రభుత్వంమే భరించాలి" అని జాజుల డిమాండ్ చేశారు.  

గొడుగు మహేశ్ యాదవ్ మాట్లాడుతూ.. విద్య, వైద్యాన్ని జాతీయం చేయాలని, ప్రైవేట్ వర్సిటీలలో రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్లతో జనవరి 8న హైదరాబాద్ లోని ఇందిర పార్క్ వద్ద బీసీ విద్యార్థుల సమర శంఖారావం మహాసభను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ మహాసభకు వేలాది మంచి విద్యార్థులు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్ గౌడ్, బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు కనకాల శ్యాంకుర్మ తదితరులు పాల్గొన్నారు.