సావిత్రి బాయి పూలే విగ్రహాలు ఏర్పాటు చేస్తం: బీసీ నేత జాజుల వెల్లడి

హైదరాబాద్, వెలుగు: సావిత్రిబాయి పూలే 194వ రాష్ట్రస్థాయి జయంత్యుత్సవాలను జనవరి 3న రవీంద్రభారతిలో నిర్వహించనున్నట్టు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. బడుగుల జీవితాల్లో వెలుగులు నింపిన సావిత్రి బాయి పూలే విగ్రహాలను రాష్ట్రమంతటా నెలకొల్పుతామని చెప్పారు. 

మంగళవారం బీసీ భవన్ లో బీసీ మహిళా సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి జయంత్యుత్సవ బ్రోచర్ ను మహిళా సంఘాల నేతలతో కలిసి శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. బీసీలకు రాజకీయ పార్టీలు రూపొందించిన తల్లులు అవసరం లేదని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో సావిత్రిబాయి పూలే 194వ జయంతిని రాజకీయ పార్టీలకతీతంగా అందరూ కలిసి నిర్వహించాలని శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. 

అనంతరం బీసీ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు మని మంజరి మాట్లాడారు. ఈ కార్యక్రమానికి హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ఎంపీలు కె. లక్ష్మణ్, ఈటల రాజేందర్, మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ మధుసూదన చారి హాజరవుతారని ఆమె వెల్లడించారు.