పంచాయతీ ఎన్నికల్లో బీసీ జెండా ఎగరాలి..జనరల్ సీట్లలో కూడా బీసీలు పోటీ చేయాలి: చిరంజీవులు

  •  బీసీలు పార్టీల వారీగా విడిపోవద్దు: తీన్మార్ మల్లన్న

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో బీసీ జెండా ఎగరాలని బీసీ ఇంటలెక్చువల్ ఫోరమ్ చైర్మన్ చిరంజీవులు అన్నారు. జనరల్ సీట్లలో కూడా బీసీలు నిలబడి గెలవాలని పిలుపునిచ్చారు. ప్రజలతో కలిసి పనిచేసి వారి నమ్మకాన్ని పొంది సర్పంచ్, వార్డ్ మెంబర్‌‌‌‌‌‌‌‌, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎమ్మెల్సీలుగా బీసీ నేతలు గెలవాలని కోరారు. రాష్ట్రంలో పంచాయతీ రాజ్ సంస్థల పరిణామ క్రమాన్ని ఆయన ఈ సందర్భంగా వివరించారు. ఆదివారం హైదరాబాద్ ఘట్కేసర్‌‌‌‌‌‌‌‌లోని జేకే కన్వెన్షన్ హాల్లో ‘పంచాయతీ ఎన్నికలు బీసీల పాత్ర’అంశంపై బీసీ ఇంటలెక్చువల్స్ ఆధ్వర్యంలో జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు.

అనంతరం ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. బీసీలు పార్టీల వారీగా విడిపోకూడదని, కచ్చితంగా గెలిచేలా వ్యూహాత్మక ఎత్తుగడలు ఫాలో కావాలని వివరించారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీసీల మధ్య చిచ్చు పెట్టేందుకు దొరలు, అగ్ర కులస్తులు కుట్రలు చేస్తుంటారని, వీటిపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. టికెట్ అడుక్కునేందుకు దొరల దగ్గరకు వెళ్తే అప్పటి నుంచి పతనం స్టార్ట్ అవుతుందన్నారు. మాజీ ఐఏఎస్ చొల్లేటి ప్రభాకర్ మాట్లాడుతూ.. బీసీల రాజ్యాధికారానికి మూలం స్థానిక సంస్థలని, వాటిని చేజిక్కించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

శాసన మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి మాట్లాడుతూ.. బీసీలు ఏకమై బీసీ అభ్యర్థులు గెలిచేందుకు బీసీ కులాల ఐక్యం కావాలని కోరారు. మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ.. ప్రజల కోసం పనిచేసే వారిని ప్రజలే గెలిపిస్తారని చెప్పారు. కరీంనగర్ మాజీ జెడ్పీ చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్ తుల ఉమ మాట్లాడుతూ.. ప్రజల సమస్యలపై స్పందించి వాటి పరిష్కారానికి కృషి చేస్తే వారే గెలిపిస్తారని, ప్రజల కోసం పోరాటాలు చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వట్టే జానయ్య యాదవ్, చెరుకు సుధాకర్ గౌడ్‌‌‌‌
 తదితరులు హాజరయ్యారు.