బీసీ కమిషన్​కు కులగణన లెక్కలు .. రిపోర్టు రెడీలో కమిషన్ అధికారులు

హైదరాబాద్, వెలుగు: లోకల్  బాడీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై ఏర్పాటయిన బీసీ డెడికేటెడ్  కమిషన్ కు కులగణన లెక్కలు అందాయి. ఆ లెక్కలను పరిశీలిస్తూ తుది నివేదిక సిద్ధంచేసే పనిలో కమిషన్  నిమగ్నమయింది. తుది నివేదికను వచ్చే నెల 10 లోపు ప్రభుత్వానికి అందజేస్తామని కమిషన్  వర్గాలు తెలిపాయి. దీనికితోడు మరికొన్ని వివరాలు కావాలని ప్లానింగ్  డిపార్ట్ మెంట్ ను కమిషన్  అడిగినట్లు తెలుస్తోంది. ఈనెల చివరి వరకు ఈ వివరాలు వస్తాయంటున్నారు. 

బీసీ రిజర్వేషన్ల పెంపుపై ప్రధానంగా సుప్రీంకోర్టు మార్గదర్శకాలను, పంచాయతీ రాజ్ యాక్ట్  2018 ను పరిగణనలోకి తీసుకొని తుది రిపోర్టును తయారు చేస్తున్నారు.  రిజర్వేషన్లు అన్ని కలిపి 50  శాతం దాటకూడదని సుప్రీంకోర్టు గతంలో తీర్పు ఇచ్చి ఉంది. అయితే.. ఏజెన్సీ ఏరియాల్లో 100 శాతం జనాభా ఉంటే ఆ జనాభాకే  మొత్తం రిజర్వేషన్లు ఇవ్వనున్నారు. అనంతరం ఈ రిపోర్టును పరిశీలించి కేబినెట్ లో ఆమోదించనున్నారు. సంక్రాంతి తరువాత మొత్తం మూడు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఎన్నికల సంఘం షెడ్యూల్  రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి.