ముగ్గురు కలెక్టర్లపై బీసీ కమిషన్ ఆగ్రహం 

  •     బహిరంగ విచారణకు రాకపోవడంపై చైర్మన్ నిరంజన్ అసంతృప్తి
  •     రిజర్వేషన్ల చర్చపై నిర్లక్ష్యం కరెక్ట్ కాదని ఫైర్

సంగారెడ్డి, వెలుగు: సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట కలెక్టర్ల తీరుపై బీసీ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. స్థానిక సంస్థల రిజర్వేషన్ల అమలు నేపథ్యంలో బుధవారం సంగారెడ్డి కలెక్టరేట్ ఆడిటోరియంలో కుల సంఘాలతో బీసీ కమిషన్ బహిరంగ విచారణ చేపట్టింది. దీనికి మెదక్, సిద్దిపేట జిల్లా కలెక్టర్లు రాహుల్ రాజ్, మను చౌదరి హాజరుకాలేదు. సంగారెడ్డి కలెక్టర్ క్రాంతి వల్లూరు ప్రోటోకాల్ పాటించలేదు. కమిషన్ చైర్మన్, సభ్యులను ప్రోటోకాల్ ప్రకారం జిల్లా కలెక్టర్ క్రాంతి  రిసీవ్ చేసుకోవాలి.

కానీ అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డీఆర్వో పద్మజారాణి, ఆర్డీవో రవీంద్రారెడ్డి రిసీవ్ చేసుకున్నారు. దాంతో కలెక్టర్ల తీరుపై బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ ప్రకారం కలెక్టర్  ఎందుకు రాలేదంటూ అధికారులను ప్రశ్నించారు. ఆ తర్వాత కొద్దిసేపటికి కలెక్టర్ క్రాంతి కమిషన్ చేపట్టిన బహిరంగ విచారణకు హాజరయ్యారు.

విచారణ అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముగ్గురు కలెక్టర్ల తీరుపై నిరంజన్ మండిపడ్డారు. సమాజ హితం కోసం కమిషన్ చేపడుతున్న  విచారణకు కలెక్టర్లు హాజరుకాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం సమంజసంగా లేదని ఫైర్ అయ్యారు. రిజర్వేషన్లను క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లపై ఉంటుందన్నారు.