బీసీ రిజర్వేషన్లపై కమిషన్ ఆరా

  • అన్ని శాఖలు, కార్పొరేషన్లలో ఉద్యోగుల లెక్కల సేకరణ
  • త్వరలో రికార్డుల పరిశీలనకు సర్కారు ఆఫీసులకు కమిషన్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లలో బీసీ రిజర్వేషన్ల అమలుపై బీసీ కమిషన్ ఆరా తీస్తున్నది. ఇందుకు సంబంధించి అన్ని శాఖలు, కార్పొరేషన్లలో బీసీ ఉద్యోగులు కేటగిరీల వారీగా ప్రస్తుతం ఎంత మంది పనిచేస్తున్నరు, కేటగిరీల వారీగా ఉద్యోగుల వివరాలు, ఎపుడు ఏ పోస్ట్ లో రిక్రూట్ అయ్యారు, ప్రస్తుతం ఏ పోస్ట్ లో పనిచేస్తున్నరు, ఎన్ని ప్రమోషన్లు పొందారు, రిటైర్ మెంట్, రిటైర్ అయిన పోస్ట్ ల్లో ఎవరు చేరారు అన్న ఫార్మాట్ లో వివరాలు ఇవ్వాలని త్వరలో లేఖ రాయనుందని తెలిసింది.

జిల్లాల్లో బీసీ కమిషన్ పబ్లిక్ హియరింగ్ నిర్వహించిన సమయంలో అన్ని జిల్లాల్లో వ్యక్తిగతంగా, సంఘాల తరుఫున కమిషన్ కు పలు ఫిర్యాదులు వచ్చాయి. పలు శాఖల్లో బీసీ ఉద్యోగుల మీద, బీసీల్లో వెనుకబడిన కులాలకు చెందిన వారిపై కొంత మంది ఉన్నతాధికారులు వివక్ష చూపిస్తున్నారని, దీంతో తమకు అన్యాయం జరుగుతోందని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. వీటిని కమిషన్ పరిశీలించిన ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

ఉద్యోగులు రిటైర్ అయిన పోస్టుల్లో సీనియారిటీ ప్రకారం, రోస్టర్ పాయింట్ ప్రకారం భర్తీ చేశారా లేదా అన్న వివరాలు తీసుకోనున్నారు. త్వరలో అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులకు వివరాలు పంపాలని లేఖ రాయనున్నట్లు కమిషన్ చైర్మన్ నిరంజన్ తెలిపారు. ఈ వివరాలు వచ్చాక వీటిని స్టడీ చేసి జరిగిన లోపాలపై ప్రభుత్వానికి, ఆయా శాఖలకు సలహాలు, సూచనలు ఇస్తామన్నారు. అనంతరం ఆయా శాఖలు వివరాలు వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆఫీసులకు వెళ్లి రికార్డులు పరిశీలిస్తామని నిరంజన్ తెలిపారు.