చీఫ్​ వార్డెన్​ లైంగికంగా వేధిస్తున్నడు

  • మా సమస్యలను వీసీ పట్టించుకుంటలే

  • ఎస్సీ, ఎస్టీ కమిషన్​ ముందు బాసర ట్రిపుల్​ ఐటీ స్టూడెంట్ల గోడు

  • వీసీ వెంకటరమణ క్యాంపస్​లో ఉంటలే

  • నాణ్యమైన భోజనం అందిస్తలే.. సరిపోయే ఫ్యాకల్టీ లేదు

  • చీఫ్​ వార్డెన్​ శ్రీధర్​ను, వీసీని తొలగించాలని ఫిర్యాదు

భైంసా/బాసర, వెలుగు:  బాసర ట్రిపుల్​ ఐటీ చీఫ్​ వార్డెన్​ శ్రీధర్​ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని స్టూడెంట్స్​ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మీద ఇప్పటికే వీసీ వెంకటరమణకు చాలాసార్లు  ఫిర్యాదు చేశామని, అయినా పట్టించుకోవడం లేదని వాపోయారు. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్​ చైర్మన్​ బక్కి వెంకటయ్య, సభ్యులు శుక్రవారం బాసర ట్రిపుల్​ఐటీని సందర్శించారు. అడ్మినిస్ట్రేటివ్​ బిల్డింగ్​ కాన్ఫరెన్స్​హాల్​లో స్టూడెంట్లతో విడివిడిగా మాట్లాడారు.   చీఫ్​ వార్డెన్​ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని,  వర్సిటీ సమస్యలను వీసీ పట్టించుకోవడం లేదని తెలిపారు. దాదాపు 2 గంటల పాటు విద్యార్థులు చెప్పిన విషయాలను విన్న చైర్మన్​ వెంకటయ్య.. వాటిని రికార్డు చేయించారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.  

క్యాంపస్​లో వీసీ ఉంటలే

వీసీ వెంకటరమణ క్యాంపస్​లో ఉండడంలేదని, హైదరాబాద్​లోనే ఉంటున్నారని, దీంతో సమస్యలను ఆలకించే నాథుడు లేకుండా పోయారని విద్యార్థులు ఆవేదన వెలిబుచ్చారు. మెస్ కాంట్రాక్టర్లను మార్చి మళ్లీ  టెండర్లు నిర్వహించాలని కోరు తున్నప్పటికీ.. పాత ఏజెన్సీలనే వీసీ కొనసాగిస్తున్నారని, ఈ ఏజెన్సీలు నాణ్యమైన భోజనం అందించడం లేదని ఎస్సీ, ఎస్టీ కమిషన్​ చైర్మన్​ దృష్టికి తెచ్చారు. వీసీ పర్యవేక్షణ కొరవడిందని, ప్రొఫెసర్లతో పాటు అనేక పోస్టులు ఖాళీలు ఏండ్ల తరబడి ఖాళీగా ఉన్నాయన్నారు. ప్రశ్నించే స్టూడెంట్లను క్రమశిక్షణ పేరుతో వేధిస్తున్నారని వాపోయారు. వెంకటరమణను వెంటనే వీసీ పదవి నుంచి తప్పించాలని, చీఫ్​ వార్డెన్​ శ్రీధర్​ను విధుల నుంచి తొలగించాలని విద్యార్థులు డిమాండ్​ చేశారు. 

6 వేల మందికి నలుగురే కేర్​ టేకర్లా?: వెంకటయ్య

బాసర ట్రిపుల్​ఐటీలో దాదాపు 6 వేల మంది విద్యార్థులుండగా.. కేవలం నలుగురు కేర్​ టేకర్లు ఉండడం పట్ల ఎస్సీ, ఎస్టీ కమిషన్​ చైర్మన్​ బక్కి వెంకటయ్య సీరియస్ అయ్యారు. విద్యార్థుల విషయంలో అధికారులు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. వెంటనే స్టూడెంట్ల సంఖ్యకు తగ్గట్టు కేర్​ టేకర్లను నియమించాలని ఆదేశించారు.  ఎస్సీ, ఎస్టీ కమిషన్​ వస్తున్నట్టు తెలిసినా చీఫ్​ వార్డెన్​ శ్రీధర్​ అక్కడికి రాలేదు.