తాను జన్మలో ఇండిగో విమానం (IndiGo airlines) ఎక్కనని కేరళ LDF కన్వీనర్ శపథం చేశారు. తానే కాకుండా కుటుంబసభ్యులు కూడా ఆ సంస్థకు చెందిన విమానాల్లో ప్రయాణించరని తెలిపారు. నడిచి ఎంతదూరమైనా వెళుతాను కానీ.. ఆ విమానంలో మాత్రం ప్రయాణించనని ప్రకటించారు. ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక బలమైన కారణమే ఉంది. గత నెల 13వ తేదీన కేరళ సీఎం పినరయి విజయన్ తో పాటు కన్నూరు నుంచి తిరువనంతపురం వరకు జయరాజన్ ఇండిగో విమానంలో ప్రయాణించారు. ఆ సమయంలో విమానంలో ఇద్దరు కాంగ్రెస్ కార్యకర్తలున్నారు. గోల్డ్ స్కాంలో వీరిద్దరూ సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వీరిపై జయరాజన్ దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణలున్నాయి. దీనిపై ఇండిగో సీరియస్ గా స్పందించింది. జయరాజన్ పై మూడు వారాల పాటు నిషేధం విధించింది. నినాదాలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్యకర్తలపైనా రెండు వారాల పాటు నిషేధం విధించింది. వారిపై పోలీసులపై కేసులు కూడా నమోదు చేశారు.
దీనిపై జయరాజన్ స్పందించారు. ఇండిగో లాంటి కార్పొరేట్ కంపెనీ ఖాతాల్లోకి తన జేబులో నుంచి ఒక్క రూపాయి వెళ్లకుండా చూసుకుంటానని, విమానాల్లో ప్రయాణించడం కంటే వాకింగ్ కు వెళ్లాలని అనుకుంటున్నట్లు తెలిపారు. అన్నట్లుగానే సోమవారం తన కుటుంబంతో రైలులో కన్నూరుకు జయరాజన్ వెళ్లారు. వారిని ఆపినందుకు తనను అభినందించాల్సింది పోయి.. చర్యలు తీసుకోవడం నిబంధనలకు విరుద్ధమన్నారు. ఘటనపై రిటైర్డ్ జడ్జీ నేతృత్వంలోని ఎయిర్ లైన్స్ త్రిసభ్య అంతర్గత విచారణ కమిటీ దర్యాప్తు జరిపింది. జూన్ 16వ తేదీన కమిటీని ఏర్పాటు చేశారు. అనంతరం నిబంధనలు ఉల్లంఘించారంటూ నివేదిక ఇచ్చింది. దీంతో ఇండిగో సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయ, అంతర్జాతీయ విమానాల్లో ప్రయాణించకుండా నిషేధం విధించింది. దీనిపై సీపీఎం స్పందించింది. వాస్తవాలు తెలుసుకోకుండా ఇండిగో సంస్థ నిర్ణయం తీసుకుందని..దీనిని పున:సమీక్షించాలని కోరింది.
