- కస్టమర్లు రాకపోవడమే కారణం
ముంబై: బ్యాంకుల నిర్వహణలో క్లర్కుల పాత్ర కీలకం. కస్టమర్ మొదట వీళ్ల దగ్గరికే వస్తాడు. డిపాజిట్, విత్‌డ్రాయల్, డీడీ తీయడం వంటి పనులన్నీ క్లర్కుల చేతుల మీదుగానే జరగాలి. అందుకే ఎప్పుడు చూసినా వీళ్లు బిజీబిజీ! అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. డిజిటల్ పేమెంట్స్ వల్ల క్లర్కుల అవసరం తగ్గుతోంది. మారుమూల గ్రామాల వాళ్లు కూడా గూగుల్‌పే, ఫోన్‌పే వంటి యూపీఐ యాప్స్, అమెజాన్ పే, పేటీఎం వంటి వాలెట్స్ వాడుతున్నారు. చౌకగా నెట్అందుబాటులో ఉంది. చిన్న పాన్షాపులోనూ స్మార్ట్‌ఫోన్ ద్వారా డబ్బు చెల్లించే సదుపాయం వచ్చింది. డబ్బు తీసుకోవడానికి ఏటీఎంలు ఎలాగూ ఉంటాయి కాబట్టి బ్యాంకుల గడప తొక్కాల్సిన అవసరం పెద్దగా రావడం లేదు. అందుకే బ్యాంకులు ఈ జాబ్స్ సంఖ్యను మెల్లమెల్లగా తగ్గిస్తున్నాయి. భారతదేశ బ్యాంకింగ్ వ్యవస్థలో క్లరికల్ ఉద్యోగాల వాటా 90లలో 50 శాతం కంటే ఎక్కువ ఉండేది. 2021 ఆర్థిక సంవత్సరం నాటికి ఇది 22 శాతానికి పడిపోయిందని రిజర్వ్ బ్యాంక్ పేర్కొంది. క్లర్కులు సాధారణంగా టెల్లర్లుగా, క్యాషియర్‌లుగా, అధికారులకు సహాయకులుగా పనిచేస్తారు. అధికారికి లోన్లను, అడ్వాన్సులను మంజూరు చేసే పవర్ ఉంటుంది. క్లర్కుకు ఇలాంటి అధికారం ఉండదు. ఇదొక్కటే వీరి మధ్య తేడా.
తగ్గుతున్న క్యూలు..
మొబైల్ ఫోన్‌ల రాకతో పట్టణ ప్రాంతాలలోనూ బ్రాంచ్‌ల వద్ద పొడవైన క్యూలు తగ్గుముఖం పట్టడంతో క్లర్కులకు పనిభారం తక్కువ అవుతోందని బ్యాంకింగ్ సెక్టార్ ఎక్స్పర్టులు చెబుతున్నారు. “ప్రైవేటుతోపాటు ప్రభుత్వ రంగ బ్యాంకులలో కూడా క్లర్కులను తగ్గించడంలో టెక్నాలజీ ప్రధాన పాత్ర పోషించింది. అన్ని చోట్లా మార్పు కనిపిస్తున్నది. క్లర్కులు ఇంతకుముందులా బ్యాంక్ కార్యకలాపాలకు కేంద్రంగా ఉండకపోవడానికి ఆటోమేషన్ ముఖ్యకారణం. ఈ రోజుల్లో ఎక్కువ ఫైల్‌లను తరలించాల్సిన అవసరం లేదు. ఎక్కువ డాక్యుమెంట్లను చూడాల్సిన అవసరం లేదు. చాలా వరకు ఆటోమేషన్ విధానంలోనే పనులు జరుగుతున్నాయి. కొన్ని పనులను బ్యాంకులు థర్డ్‌పార్టీలకు అప్పగించాయి" అని ఫైన్‌హ్యాండ్ కన్సల్టెంట్స్ మేనేజింగ్ పార్ట్‌నర్ వీను నెహ్రూ దత్తా అన్నారు. ఇది వరకు బ్యాంకు బ్రాంచ్‌ల దగ్గర పెద్ద సంఖ్యలో జనం ఉండేవారు. చాలా మంది ప్రజలు ఆన్‌లైన్ లావాదేవీలను ఉపయోగిస్తున్నప్పుడు బ్యాంకులకు ఎక్కువ మంది సిబ్బంది అవసరం లేదని ఆమె అన్నారు.
క్లర్కుల సంఖ్యను పెంచాల్సిందే...
ప్రభుత్వ- బ్యాంకులలో మానవ వనరులను పరిశీలించే కమిటీ ఈ విషయమై కీలక సూచనలు చేసింది. కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్స్ (సీబీఎస్) అందుబాటులో ఉన్నప్పటికీ క్లరికల్ ఉద్యోగాల భర్తీని కొనసాగించాలని 2010లో విడుదల చేసిన రిపోర్టులో పేర్కొంది. క్లరికల్ సిబ్బంది భవిష్యత్తు, అవసరంపై బ్యాంకులు తీవ్రంగా చర్చించాల్సిన అవసరం ఉందని, ‘హెడ్ -టు-హెడ్ రీప్లేస్‌మెంట్’ విధానంలో క్లరికల్ బలాన్ని నిర్ణయించలేమని బ్యాంక్ ఆఫ్ బరోడా మాజీ ఛైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ కె. ఖండేల్‌వాల్ నాయకత్వంలోని ప్యానెల్ పేర్కొంది. రిటైల్మెంట్, బ్రాంచ్‌ల విస్తరణ, బిజినెస్ పెంచడానికి బ్యాంకులు క్లర్కులను తీసుకుంటున్నాయని, దీనివల్ల ప్రొడక్టివిటీ దెబ్బతింటుందని కామెంట్ చేసింది. క్లర్కుల సంఖ్యను తగ్గించడంపై బ్యాంకు యూనియన్లు భగ్గుమంటున్నాయి. ఇదివరకటి మాదిరే క్లర్కులు బ్యాంకింగ్‌లో కీలకపాత్ర పోషించేలా చూడాలని అంటున్నాయి. ఫ్రంట్‌లైన్ క్లరికల్ స్టాఫ్‌కు మరిన్ని అధికారాలు ఇవ్వాలని కోరుతున్నాయి. ఈ విషయమై ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్‌పై, కేంద్రంపై ఒత్తిడి తెస్తామని చెబుతున్నాయి. ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం మాట్లాడుతూ రూ.70 వేల జీతమిచ్చి ఆఫీసర్లను నియమించుకునే బదులు, రూ.30 వేలు ఇచ్చి క్లర్కును తీసుకుంటే మేలని అభిప్రాయపడ్డారు. మిగతా స్టాఫ్ కంటే క్లర్కులే ఎక్కువగా పనిచేస్తారని అన్నారు.
