- బ్యాంకులను పీడిస్తున్న మొండి బాకీలు
- ఆగని అసెట్ క్వాలిటీ పతనం
- రిపోర్టులో వెల్లడించిన ఆర్బీఐ
న్యూఢిల్లీ: ప్రభుత్వం చేసిన సాయం వల్ల బ్యాంకింగ్ సెక్టార్ కరోనా ఇబ్బందుల నుంచి కొద్దిగా కోలుకున్నా, సవాళ్ల నుంచి పూర్తిగా బయటపడలేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బీఐ) పేర్కొంది. ప్రైవేటు, పబ్లిక్ బ్యాంకులు ఇప్పటికీ మొండిబాకీల సమస్యలను ఎదుర్కొంటున్నాయని కామెంట్ చేసింది. కాగా, షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల (ఎస్సీబీల) మొండిబాకీల (జీఎన్‌పీఏ) నిష్పత్తి మార్చి 2020 చివరి నాటికి 8.2శాతం ఉండగా, 2021 సెప్టెంబర్ చివరి నాటికి 6.9 శాతానికి తగ్గింది. అయినప్పటికీ బ్యాంకుల మొండిబాకీలు ఎక్కువే. ఇప్పటికీ బకాయిలు సరిగా వసూలు కావడం లేదు. డిపాజిట్లు తక్కువగానే ఉన్నాయి. అయితే, ఎకానమీ గాడినపడుతోందని, కరోనా ఎఫెక్ట్ నుంచి చాలా వరకు బయటపడ్డామని ప్రకటించింది. ప్రపంచమంతటా ఇలాంటి సానుకూల పరిస్థితి కనిపిస్తోందని, రిస్ట్రిక్షన్లను ఎత్తేయడం వల్ల రికవరీ మొదలైందని పేర్కొంది. మనదేశంలో బ్యాంకింగ్ సెక్టార్లో ఈ ఏడాది జరిగిన మార్పులు, సాధించిన విజయాల గురించి వివరిస్తూ తయారు చేసిన రిపోర్టులో ఈ విషయాలను వెల్లడించింది. దీని ప్రకారం.. కరోనా వల్ల బ్యాంకింగ్ సెక్టార్ నష్టపోయింది. అసెట్ క్వాలిటీ సమస్యలు పెరిగినా, ప్రభుత్వం బ్యాంకులకు సపోర్ట్ ఇవ్వడం వల్ల నిలదొక్కుకోగలిగాయి. కొంతకాలం తరువాత ఈ సపోర్ట్ నిలిచిపోవడంతో మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. ఇక నుంచి కూడా బ్యాంకులపై ఒత్తిడి కొనసాగవచ్చు. అసెట్ క్వాలిటీ, లాభాలపై ఎఫెక్ట్ తప్పక ఉంటుంది. నష్టాల నుంచి బయటపడేందుకు బ్యాంకులు కొత్త కొత్త టెక్నాలజీలను అందిపుచ్చుకోవాలి. అవసరమైతే ప్రైవేటు ప్లేయర్లతోనూ ఒప్పందాలు కుదుర్చోవాలి. ఉదాహరణకు లోన్లు ఇవ్వడానికి ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు గూగుల్ పేతో జట్టు కట్టినట్టు.
డిజిటల్ కరెన్సీతో ఎన్నో లాభాలు
సెంట్రల్ బ్యాంకు డిజిటల్కరెన్సీపై (సీబీడీసీ) ఆర్‌బీ ఐ కీలక కామెంట్స్ చేసింది. దీనివల్ల ఎన్నో లాభాలు ఉంటాయని స్పష్టం చేసింది. ‘‘సీబీడీసీ వల్ల యూజర్ల దగ్గర లిక్విడిటీ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ మంది వాడితే అంతటా ఉపయోగించుకోవచ్చు. ట్రాన్సాక్షన్లకు సెక్యూరిటీ ఉంటుంది. ఏవైనా పొరపాట్లు జరిగినా డబ్బు చాలా వేగంగా వెనక్కి వస్తుంది. అయితే దీనికి సంబంధించిన లాజిస్టిక్స్, మోడల్ కు సంబంధించిన ప్రశ్నలకు జవాబులు రావాలి. పేమెంట్స్ సిస్టమ్స్ డెవలప్ అయితే అత్యాధునిక టెక్నాలజీతో కూడిన సీబీడీసీని అందుబాటులోకి తేవొచ్చు’’ అని ఈ రిపోర్టు పేర్కొంది. ఈ కరెన్సీ అందుబాటులోకి వస్తే క్రాస్ బోర్డర్ పేమెంట్స్ కూడా పారదర్శకంగా ఉంటాయని తెలిపింది. బ్యాంకుల అవసరం లేకుండానే అన్ని రకాల పేమెంట్స్ సులువుగా చేసుకోవచ్చంది.
1) కరోనా ఎఫెక్ట్ పూర్తిగా తొలగిపోనప్పటికీ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ (ఎస్సీబీలు) బ్యాలెన్స్షీటు ఈ ఆర్థిక సంవత్సరంలో బలోపేతమయ్యే అవకాశాలు ఉన్నాయి. క్రెడిట్‌గ్రోత్ మెల్లమెల్లగా పెరుగుతోంది. ఈ ఏడాది సెప్టెంబరులో డిపాజిట్స్ 10.1 శాతం పెరిగాయి. గత ఏడాది ఇదే నెలలో ఇవి 11 శాతం ఉన్నాయి.
2) ఆస్తులపై రాబడి (ఆర్‌ఓఏ) 2020 మార్చి చివరినాటికి 0.2 శాతం నుండి 2021 మార్చి చివరి నాటికి 0.7శాతానికి మెరుగుపడింది. ఆదాయం నిలకడగా ఉండటం, ఖర్చుల తగ్గుదల వల్ల రాబడులు పెరిగాయి.
3) క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ అసెట్స్ (సీఆర్ఏఆర్) నిష్పత్తి మార్చి 2020 చివరినాటికి 14.8శాతం ఉండగా, మార్చి 2021లో 16.3శాతానికి పెరిగింది. సెప్టెంబరు 2021 చివరి నాటికి 16.6 శాతం వరకు ఎదిగింది. ఆదాయాలు బాగుండటం, పీఎస్‌బీల రీక్యాపిటలైజేషన్, మార్కెట్ నుండి మూలధనం తీసుకురావడం ఇందుకు కారణాలు.
4) రాష్ట్ర సహకార బ్యాంకులు , జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల లాభదాయకత 2019-20లో మెరుగుపడింది. అయితే వాటి అసెట్ క్వాలిటీ తగ్గిపోయింది.
5) ఎన్‌బీఎఫ్‌సీల కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్లు 2021 ఆర్థిక సంవత్సరంలో బలపడ్డాయి. క్రెడిట్ , నాన్- డిపాజిట్-టేకింగ్ లు పెరిగాయి. అసెట్ క్వాలిటీ , క్యాపిటల్‌లు మెరుగుపడ్డాయి.
