రెండు రోజులపాటు బ్యాంకుల సమ్మె

రెండు రోజులపాటు బ్యాంకుల సమ్మె

చండీగఢ్‌: జాతీయ బ్యాంకుల విలీనానికి వ్యతిరేకంగా ఈ నెల 25, 26 తేదీల్లో సమ్మె చేస్తామని నాలుగు బ్యాంకు యూనియన్లు గురువారం ప్రకటించాయి. వచ్చే నెల రెండోవారం నుంచి నిరవధిక ఆందోళనలు మొదలుపెడతామని తెలిపాయి. విలీనాలను రద్దు చేయడంతోపాటు వేతనాలను పెంచాలని డిమాండ్‌ చేశాయి. ఆలిండియా బ్యాంక్‌ ఆఫీసర్స్‌ కాన్ఫిడరేషన్‌, ఆలిండియా బ్యాంక్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌, ఇండియన్ నేషనల్‌ బ్యాంక్‌ ఆఫీసర్స్‌ కాంగ్రెస్‌, నేషనల్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ బ్యాంక్‌ ఆఫీసర్స్‌ సమ్మెలో పాల్గొంటాయని యూనియన్‌ నాయకుడు ఒకరు తెలిపారు. వారంలో పని దినాలను ఐదు రోజులకు తగ్గించడం, రిటైర్‌మెంట్ సమస్యల పరిష్కారం, కొత్త ఉద్యోగాల భర్తీ, ఎన్‌పీఎస్‌ రద్దు వంటి డిమాండ్లను కూడా లేవనెత్తుతామని ఆయన వివరించారు.  పది ప్రభుత్వరంగ బ్యాంకులను (పీఎస్‌బీలు) కలిపి నాలుగు పెద్ద బ్యాంకులుగా చేస్తామని కేంద్రం ప్రకటించడం తెలిసిందే. పంజాబ్‌ నేషనల్ బ్యాంక్‌, ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌, యునైటెడ్‌ బ్యాంక్‌ను విలీనం చేసి దేశీయ రెండో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ఏర్పాటు చేస్తారు. కెనరా బ్యాంక్‌, సిండికేట్‌ బ్యాంక్‌ను కలిపి నాలుగో అతిపెద్ద ప్రభుత్వ రంగ  బ్యాంక్‌గా, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఆంధ్రా బ్యాంక్‌, కార్పొరేషన్‌ బ్యాంక్‌ను కలిపి ఐదో అతిపెద్ద బ్యాంక్‌గా ఏర్పాటు చేస్తారు. ఇండియన్‌ బ్యాంక్‌ను అలహాబాద్‌ బ్యాంక్‌లో విలీనం చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.