తొలి టీ20లో బంగ్లా విక్టరీ

కింగ్స్‌‌టౌన్ (సెయింట్ లూసియా): వెస్టిండీస్‌‌తో వన్డే సిరీస్‌‌లో వైట్‌‌వాష్ అయిన బంగ్లాదేశ్‌‌ టీ20 సిరీస్‌‌లో శుభారంభం చేసింది. మూడు మ్యాచ్‌‌ల సిరీస్‌‌లో భాగంగా ఆదివారం రాత్రి జరిగిన తొలి టీ20లో బంగ్లా 7 రన్స్ తేడాతో ఆతిథ్య విండీస్‌‌పై ఉత్కంఠ విజయం సాధించింది. తొలుత బంగ్లా నిర్ణీత 20 ఓవర్లలో 147/6 స్కోరు చేసింది. ఓపెనర్ సౌమ్య సర్కార్ (43), జాకెర్ అలీ (27), మెహిదీ హసన్ (26 నాటౌట్‌‌), షమీమ్ హుస్సేన్ (27) ఆకట్టుకున్నారు. ఆతిథ్య బౌలర్లలో అకీల్ హొసేన్‌‌, ఒబెడ్‌‌ మెకాయ్‌‌ రెండేసి వికెట్లు పడగొట్టారు. 

అనంతరం ఛేజింగ్‌‌కు వచ్చిన విండీస్‌‌  19.5 ఓవర్లలో 140 రన్స్‌‌కు ఆలౌటైంది. కెప్టెన్‌‌ రోవ్‌‌మన్ పావెల్ (60) ఒంటరి పోరాటం, చివర్లో రొమారియో షెఫర్డ్‌‌ (22) మెరుపులు కరీబియన్ జట్టును గెలిపించలేకపోయాయి. బంగ్లా స్పిన్నర్ మెహిదీ హసన్ నాలుగు వికెట్లతో ఆతిథ్య జట్టును దెబ్బకొట్టాడు. అతనికే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 బుధవారం జరుగుతుంది.