WI vs BAN: చారిత్రాత్మక విజయం.. వెస్టిండీస్ గడ్డపై సిరీస్ గెలిచిన బంగ్లాదేశ్

టీ20 ఫార్మాట్ లో వెస్టిండీస్ పై సిరీస్ పై గెలవడం అంత సామాన్యమైన విషయం కాదు. సొంతగడ్డపై ఆ జట్టు మరింత పటిష్టంగా కనిపిస్తుంది. పవర్ హిట్టర్లు ఉన్న విండీస్ జట్టును ఆపాలంటే బౌలర్లకు శక్తికి మించిన పని. అయితే బలహీనమైన బంగ్లాదేశ్ వెస్టిండీస్ గడ్డపై ఏకంగా టీ20 సిరీస్ ను గెలిచింది. తక్కువ స్కోర్ కొట్టినప్పటికీ క్రమశిక్షణగా ఆడుతూ తొలి రెండు మ్యాచ్ ల్లో విజయం సాధించింది. మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. 

బుధవారం (డిసెంబర్ 18) కింగ్ స్టన్ వేదికగా జరిగిన రెండో టీ20లో వెస్టిండీస్ పై 27 పరుగులతో విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 129 పరుగులు మాత్రమే చేయగలిగింది. విండీస్ బౌలర్లు విజృంభించడంతో ఒక దశలో బంగ్లాదేశ్ 72 పరుగులకే 6 వికెట్లను కోల్పోయింది. ఈ దశలో షామీమ్ హుస్సేన్ 17 బంతుల్లోనే 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 35 పరుగులు చేసి బంగ్లాకు ఓ మోస్తరు స్కోర్ అందించాడు. 

130 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో వెస్టిండీస్ పూర్తిగా తడబడింది. స్టార్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ క్రమం తప్పకుండా వికెట్లను కోల్పోయింది. 42 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అకేల్ హోసేన్(31),రోస్టన్ చేజ్(32) పోరాడినా విండీస్ కు విజయాన్ని అందించలేకపోయారు. బంగ్లాదేశ్ బౌలర్లలో తస్కిన్ అహ్మద్ మూడు వికెట్లతో వెస్టిండీస్ పరాజయానికి కారణమయ్యాడు. మెహదీ హసన్, సాకిబ్, రిషద్ హుస్సేన్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. షామీమ్ హుస్సేన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.