WI vs BAN: కరీబియన్లకు ఊహించని షాక్: బంగ్లాదేశ్ చేతిలో వెస్టిండీస్ వైట్ వాష్

టీ20 ఫార్మాట్ లో వెస్టిండీస్ కు బంగ్లాదేశ్ ఊహించని షాక్ ఇచ్చింది. విండీస్ గడ్డపై టీ20 సిరీస్ గెలవడం అంత సామాన్యమైన విషయం కాదు. సొంతగడ్డపై ఆ జట్టు మరింత పటిష్టంగా కనిపిస్తుంది. పవర్ హిట్టర్లు ఉన్న విండీస్ జట్టును ఆపాలంటే బౌలర్లకు శక్తికి మించిన పని. అయితే బలహీనమైన బంగ్లాదేశ్ వెస్టిండీస్ గడ్డపై ఏకంగా టీ20 సిరీస్ ను ఏకంగా క్లీన్ స్వీప్ చేసింది. తక్కువ స్కోర్ కొట్టినప్పటికీ క్రమశిక్షణగా ఆడుతూ తొలి రెండు మ్యాచ్ ల్లో విజయం సాధించిన బంగ్లాదేశ్.. శుక్రవారం (డిసెంబర్ 20) జరిగిన మూడో టీ20 లో భారీ విజయం సాధించింది.

ఈ విజయంతో మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ ను బంగ్లాదేశ్ 3-0 తేడాతో కైవసం చేసుకుంది. జేకర్ అలీలకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు, మెహిదీ హసన్ కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు లభించాయి. శుక్రవారం (డిసెంబర్ 20) కింగ్ స్టన్ వేదికగా జరిగిన మూడో టీ20లో 80 పరుగుల తేడాతో విండీస్ జట్టును మట్టికరిపించింది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 189 పరుగుల భారీ స్కోర్ చేసింది. జేకర్ అలీ 72 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.

Also Read :- 10 మంది ఫీల్డర్లతో ఆడలేం

పర్వేజ్ హొస్సేన్ ఎమోన్ (39), మెహిదీ హసన్ మిరాజ్(29) రాణించారు. లక్ష్య ఛేదనలో వెస్టిండీస్ 109 పరుగులకే కుప్పకూలింది. 33 పరుగులు చేసి షెపర్డ్ పర్వాలేదనిపించాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో రిషద్ హుస్సేన్ 3 వికెట్లు తీసుకున్నాడు. తస్కిన్ అహ్మద్, మెహదీ హసన్ మిరాజ్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు.