షేక్ హసీనాకు మరో షాక్.. పాస్ పోర్టు రద్దు చేసిన బంగ్లా సర్కార్

ఢాకా: దేశం విడిచి పారిపోయిన బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరో షాక్ తగిలింది. యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం షేక్ హసీనా పాస్‌పోర్ట్‌ను రద్దు చేసింది. హసీనాతో పాటు మరో 96 మంది పాస్ పోర్టులను సైతం రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. వీరిపై క్రిమినల్ ఆరోపణలు   నమోదు కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఈ మేరకు బంగ్లా రాజధాని ఢాకాలో మంగళవారం (జవనరి 7) ప్రభుత్వం ఈ ప్రకటన వెల్లడించింది. 

ఇందులో 22 మంది వ్యక్తులు బలవంతపు అదృశ్యాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటుండగా.. మరో 75 మందికి గత ఏడాది బంగ్లాదేశ్‌లో విద్యార్థుల నిరసనల సందర్భంగా జరిగిన హత్యలలో ప్రమేయం ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొంది. షేక్ హసీనా పదవీ కాలంలో జరిగిన చట్టవిరుద్ధమైన హత్యల కేసులో అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ (ICT) ఆమెపై అరెస్టు వారెంట్ జారీ చేసింది. 

ALSO READ | ప్రధాని పదవికి ట్రూడో రాజీనామా.. డైరీ క్వీన్ బంపర్ ఆఫర్

2025, జనవరి 6న వారెంట్ జారీ చేసిన ఐసీటీ.. 2025, ఫిబ్రవరి 12వ తేదీ వరకు హసీనా అరెస్ట్ చేసి తమ ముందు హాజరుపర్చాలని ఆదేశించింది. ఐసీటీ ఆదేశాలు వెలువడిన మరుసటి రోజే బంగ్లా ప్రభుత్వం హసీనా పాస్ పోర్టును రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కాగా, హసీనా నేతృత్వంలోని ఆవామీ లీగ్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా యువత పెద్ద ఎత్తున ఆందోళనలు చేసిన విషయం తెలిసిందే.

 రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మొదలైన ఈ ఆందోళనలు చిలికి చిలికి గాలివానలా మారి.. దేశమంతా వ్యాప్తి చెందాయి. ఈ నిరసనలు హింసాత్మకంగా మారి దాదాపు 600 మంది మృతి చెందారు. దేశంలో హింసాత్మక ఘటనలో చోటు చేసుకోవడంతో రంగంలోకి దిగిన ఆర్మీ పాలనను తమ ఆధీనంలోకి తీసుకుని బంగ్లాలో సైనికా పాలన విధించింది. దీంతో షేక్ హసీనా 2024, ఆగస్టు 5వ తేదీన బంగ్లాదేశ్ నుండి పారిపోయి భారత్‎లో తలదాచుకున్నారు.