- అండర్–19 ఆసియా కప్ ఫైనల్లో ఇండియా ఓటమి
- 59 రన్స్ తేడాతో గెలిచి ట్రోఫీ నెగ్గిన బంగ్లాదేశ్
దుబాయ్: అండర్–19 ఆసియా కప్‌లో తొమ్మిదో సారి విజేతగా నిలవాలని ఆశించిన ఇండియా కుర్రాళ్లకు షాక్ తగిలింది. తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్ చేతిలో ఓడిన తర్వాత అద్భుతంగా పుంజుకొని ఫైనల్‌కు దూసుకొచ్చిన ఇండియాను ఆఖరాటలో బంగ్లాదేశ్ దెబ్బకొట్టింది. గతేడాది సెమీఫైనల్లో యంగ్ ఇండియా పని పట్టిన బంగ్లా ఈసారి ఫైనల్లో మన కుర్రాళ్లను పడగొట్టింది. చిన్న టార్గెట్‌ను అద్భుతంగా కాపాడుకుంటూ వరుసగా రెండోసారి విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన మెగా ఫైనల్లో బౌలర్లు అద్భుతంగా ఆడినా.. బ్యాటింగ్ ఫెయిల్యూర్‌తో ఇండియా 59 రన్స్ తేడాతో ఓడి రన్నరప్‌తో సరిపెట్టింది.
బంగ్లా ఇచ్చిన 199 రన్స్ టార్గెట్ ఛేజింగ్‌లో 35.2 ఓవర్లలో 139 రన్స్‌కే కుప్పకూలింది. సూపర్ ఫామ్‌లో ఉన్న ఓపెనర్లు ఆయుష్ మాత్రె (1), వైభవ్ సూర్యవంశీ (9) ఫెయిల్యూర్ దెబ్బకొట్టింది. సిద్దార్థ్ (20), కార్తికేయ (21), కెప్టెన్ మహ్మద్ అమాన్ (26) పోరాటంతో ఓ దశలో 73/3తో రేసులోకి వచ్చినా.. 19 రన్స్ తేడాతో నాలుగు వికెట్లు కోల్పోయి డీలా పడింది. చివర్లో హార్దిక్ రాజ్ (24) ఆశలు రేపినా.. బంగ్లా బౌలర్లు ఇక్బాల్ హసన్ ఎమన్ (3/24), అజిజుల్ హకీమ్ (3/8) ఇండియాకు మరో అవకాశం ఇవ్వలేదు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన బంగ్లా 49.1 ఓవర్లలో 198 రన్స్‌కే ఆలౌటైంది. రిజాన్ హస్సాన్ (47), షిహబ్ జేమ్స్ (40), ఫరీద్ హసన్ (39) రాణించారు. ఇండియా బౌలర్లలో యుధజీత్ గుహా, చేతన్ శర్మ, హార్దిక్ రాజ్ తలో రెండు వికెట్లతో బంగ్లాను తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. కానీ, ఛేజింగ్‌లో బ్యాటర్లు నిరాశపరచడంతో ఇండియాకు ఓటమి తప్పలేదు. ఇక్బాల్ హసన్ ఎమన్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డులు గెలిచాడు.
సంక్షిప్త స్కోర్లు
బంగ్లాదేశ్: 49.1 ఓవర్లలో 198 ఆలౌట్ (రిజాన్ 47, షిహబ్ 40, గుహా 2/29)
ఇండియా: 35.2 ఓవర్లలో 139 ఆలౌట్ (అమాన్ 26, అజిజుల్ 3/8, ఎమన్ 3/24)