U19 Asia Cup 2024: భారత్‌ ఓటమి.. అండర్ 19 ఆసియా కప్ విజేత బంగ్లాదేశ్

అండర్ 19 ఆసియా కప్ విజేతగా బంగ్లాదేశ్ జట్టు నిలిచింది. ఆదివారం (డిసెంబర్ 08) జరిగిన ఫైనల్లో బంగ్లాదేశ్ 59 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించి ట్రోఫీని ముద్దాడింది.

తొలుత బంగ్లాను 198 పరుగులకే కట్టడి చేసిన టీమిండియా.. బ్యాటింగ్‌లో తేలిపోయింది. బంగ్లా బ్యాటర్లు నిర్ధేశించిన 199 పరుగుల స్వల్ప ఛేదనలోనూ భారత బ్యాటర్లు తడబడ్డారు. క్రమం తప్పకుండా వికెట్లు చేజార్చుకొని మ్యాచ్ కాజేశారు. పోరాడి..పోరాడి చివరకు 35.2 ఓవర్లలో 139 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యారు. భారత ఆటగాళ్లలో కనీసం ఒక్క బ్యాటర్‌ కూడా 30 పరుగులు చేయకపోవడం గమనార్హం. కెప్టెన్ మహ్మద్ అమన్ (26) టాప్‌ స్కోరర్.

అంతకుముందు బంగ్లాదేశ్ 49.1 ఓవర్లలో 198 పరుగుల వద్ద ఆలౌటైంది. రిజాన్ హసన్ (47; 65 బంతుల్లో 3 ఫోర్లు), షిహాబ్ (40; 67 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్‌), ఫరిద్ హసన్ (39; 49 బంతుల్లో 3 ఫోర్లు) రాణించారు. భారత బౌలర్లలో యుధాజిత్ గుహా, చేతన్ శర్మ, హార్దిక్ రాజ్ రెండు వికెట్ల చొప్పున.. కిరణ్‌, కేపీ కార్తికేయ, ఆయుష్‌ మాత్రే తలో వికెట్‌ తీశారు.

భారత్ జట్టు గతేడాది ఇదే టోర్నీలో సెమీస్‌లో బంగ్లాదేశ్ చేతిలోనే ఓడటం గమనార్హం.