ఘనంగా బండారు ఉత్సవం

గద్వాల, వెలుగు: ఆదిగొండ వంశస్తుల పసుపు బండారు ఉత్సవం ఉత్సాహంగా సాగింది. ధరూర్ మండల కేంద్రంలోని ఆంజనేయ స్వామి టెంపుల్  ఆవరణలో సోమవారం పసుపు బండారు కార్యక్రమాన్ని నిర్వహించారు. రెండు రోజులుగా జరుగుతున్న బండారు ఉత్సవానికి కర్నాటక, మహారాష్ట్ర, ఏపీతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉంటున్న ఆదిగొండ వంశస్తులు పాల్గొన్నారు. 

కట్ట బీర లింగేశ్వరస్వామిని ప్రతిష్ఠించి పూజలు చేశారు. గొంగడి పరచుకొని వాటిపై కూర్చోగా, బంధువులు, వంశస్థులు పసుపు చల్లారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాంగ్రెస్  పార్టీ లీడర్  బండ్ల చంద్రశేఖర్ రెడ్డి వేర్వేరుగా వచ్చి కట్ట బీర లింగేశ్వరస్వామికి పూజలు చేయగా, వారిని నిర్వాహకులు పెద్ద కిష్టన్న, తిప్పన్న శాలువాతో సన్మానించారు. పురాతనమైన ఆచార, సంప్రదాయాలను  భావితరాలకు అందిస్తున్నారని పేర్కొన్నారు. గడ్డం కృష్ణారెడ్డి, డీఆర్  విజయ్ కుమార్, జాకీర్, రాజారెడ్డి పాల్గొన్నారు.