నాలాలో ఇండస్ట్రియల్​ వేస్ట్​ తెచ్చి పోస్తున్నరు.. మేయర్​ విజయలక్ష్మికి బాలానగర్​ వాసుల ఫిర్యాదు

కూకట్​పల్లి, వెలుగు: జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్​ విజయలక్ష్మి బుధవారం బాలానగర్, అల్లాపూర్ ​డివిజన్లలో పర్యటించారు. చాలా కాలంగా పెండింగ్​ పడిన సమస్యలపై స్థానికుల నుంచి ఫిర్యాదులు పెరగడంతో పరిశీలనకు వచ్చినట్లు తెలిపారు. బాలానగర్ ​డివిజన్​ రాజీవ్​ గాంధీనగర్​ పక్కగా వెళ్తున్న నాలాకు రిటైనింగ్​వాల్​నిర్మించాలని స్థానికులు కోరారు. కొందరు గుట్టుచప్పుడు కాకుండా ఇండస్ట్రియల్​వేస్ట్​ను తెచ్చి నాలాలో పోస్తున్నారని, వేస్ట్​పారబోతకు అడ్డుకట్ట వేయాలని విజ్ఙప్తి చేశారు. అనంతరం ఆమె అల్లాపూర్​ డివిజన్​ పరిధిలోని యూసుఫ్​నగర్, సఫ్దర్​నగర్, రాజీవ్​గాంధీనగర్​లో పర్యటించారు.

బస్తీల మధ్యగా వెళ్తున్న నాలాకు రిటైనింగ్ ​వాల్​ లేకపోవటంతో చిన్నపాటి వర్షానికే తమ ఇండ్లు మునుగుతున్నాయని స్థానికులు వాపోయారు. ముంపు నివారణకు అవసరమైన చర్యలు తీసుకుంటామని మేయర్​విజయలక్ష్మి వారికి హామీ ఇచ్చారు. ఆమె వెంట జీహెచ్ఎంసీ కూకట్​పల్లి జోనల్​కమిషనర్ అపూర్వచౌహాన్, కూకట్​పల్లి నియోజకవర్గ కాంగ్రెస్​ఇన్​చార్జ్​బండి రమేశ్​ఉన్నారు.