- రూ. 2.32 లక్షల కోట్లకు మార్కెట్ వ్యాల్యూ
- 10 ఏళ్ల కిందట రూ. 1 లక్ష పెట్టుబడి ఇప్పుడు రూ. 3.64 కోట్లైంది
- అయిదేళ్లో 13.61 రెట్లు పెరిగిన బజాజ్ ఫైనాన్స్ షేరు
- ఎసెట్ క్వాలిటీ, లాభదాయకతలే ఆకర్షణలు
న్యూఢిల్లీ: నాన్ బ్యాంకింగ్ పైనాన్స్ రంగంలోని బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ మార్కెట్ విలువపరంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)ని దాటేసింది. దాంతో దేశంలోని బీఎఫ్‌ఎస్‌ఐ ( బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్) లో అయిదో పెద్ద కంపెనీగా అవతరించింది. మంగళవారం ట్రేడింగ్‌లో బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ విలువ రూ. 2.32 లక్షల కోట్లను అందుకుంది. ఇదే సమయంలో ఎస్‌బీఐ మార్కెట్ విలువ రూ. 2.28 కోట్లుగా ఉంది. మంగళవారం ఎస్‌బీఐ షేర్లు 5.5 శాతం పతనమయ్యాయి. ఇండియాలోని అనేక ఎన్‌బీఎఫ్‌సీలు సంక్షోభం ఎదుర్కొంటుంటే, మరోవైపు బజాజ్ ఫైనాన్స్ షేర్లు మాత్రం గత అయిదేళ్లలో 13.41 రెట్లు పెరిగి టాప్ పెర్‌ఫార్మర్‌గా నిలిచింది. ఇదే అయిదేళ్లకు చూస్తే ఎస్‌బీఐ షేర్లు కేవలం 5.62 శాతం లాభపడ్డాయి. బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్‌పై ఇన్వెస్టర్ల ఆసక్తి ఇంకా కొనసాగుతోందని ఎనలిస్టులు చెబుతున్నారు. ఎసెట్ క్వాలిటీ, లాభదాయకతలో బజాజ్ ఫైనాన్స్ మెరుగైన పనితీరే దానికి కారణమని పేర్కొంటున్నారు. బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ షేర్లు గత పదేళ్లలో ఏకంగా 36257 శాతం పెరిగాయి. మరో విధంగా చెప్పాలంటే అక్టోబర్ 1, 2009 లో ఎవరైనా రూ. లక్షను బజాజ్ ఫైనాన్స్ షేర్లలో ఇన్వెస్ట్ చేసి ఉంటే, ఆ షేర్ల విలువ ఇప్పుడు రూ. 3.64 కోట్లకు చేరింది.
గత దశాబ్దకాలంగా ఆగకుండా పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు బజాజ్ ఫైనాన్స్ షేర్లలో పెట్టుబడి పెట్టాలనుకునే వారు కొంత జాగ్రత్తగా వ్యవహరించడం మేలని, వ్యాల్యుయేషన్ పరంగా కొంత ఎక్కువ స్థాయిలోనే ఆ షేర్ ఉందని ఎనలిస్టులు సూచిస్తున్నారు. 2020 ప్రైస్ టు బుక్ ప్రకారం బజాజ్ పైనాన్స్ 9 రెట్లు ఎక్కువ ధర వద్ద ప్రస్తుతం ట్రేడవుతోంది. ఇదే హెచ్‌డీఎఫ్‌సీని చూస్తే 4 రెట్లే ఎక్కువగా ట్రేడవుతోంది. వ్యాల్యుయేషన్‌పరంగా వీక్‌గా కనిపిస్తున్నా ఎస్‌బీఐ షేరు విషయంలోనూ కొంచెం జాగ్రత్త అవసరమేనని ఎనలిస్టులు భావిస్తున్నారు. కిందటి వారంలో మోర్గాన్ స్టాన్లీ ఈ షేర్ రేటింగ్‌ను తగ్గించింది. ఎసెట్ క్వాలిటీ, నెట్ ఇంటరెస్ట్ మార్జిన్ల (ఎన్‌ఐఎం) ప్రకారం చూస్తే ఎస్‌బీఐ షేర్ పెద్దగా వృద్ధి చెందకపోవచ్చనేది మార్గాన్ స్టాన్లీ అభిప్రాయం. దేశంలోని రుణ సంక్షోభం కారణంగా ఈ బ్యాంకు వద్ద అప్పులు తీసుకున్న వారిలో కొంత మంది బలహీనమైన వారూ ఉండొచ్చని మార్గాన్ స్టాన్లీ చెబుతోంది.

