న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ స్కూటర్ చేతక్ కోసం మరి కొన్ని సిటీలలో బుకింగ్స్ ఓపెన్ చేస్తామని బజాజ్ ఆటో ప్రకటించింది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు మొత్తం 12 సిటీలలో బుకింగ్స్‌ను ఓపెన్ చేశామని, దీంతో మొత్తం 20 సిటీలలో ఈ స్కూటర్ కోసం బుకింగ్స్ ఓపెన్ అవుతాయని తెలిపింది. కిందటేడాది ఎనిమిది సిటీలలో చేతక్ కోసం బుకింగ్స్‌ను కంపెనీ ఓపెన్ చేసింది. విశాఖపట్నం, కొచ్చి, కోజికోడ్, మదురై, కొయంబత్తూర్, హుబ్లి, నాసిక్, వాసై, సూరత్, ఢిల్లీ, ముంబై, మపూసా వంటి 12 కొత్త సిటీలలో చేతక్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ప్రస్తుతం 4–8 వారాల వెయిటింగ్ పీరియడ్ ఉందని బజాజ్ ఆటో ప్రకటించింది. ఎలక్ట్రిక్ స్కూటర్లను తీసుకోవడంలో కస్టమర్ల భయాలను తమ సేల్స్ నెట్వర్క్ తగ్గించిందని, రానున్న కొన్ని వారాల్లో చేతక్ నెట్‌వర్క్‌ను మరింత విస్తరిస్తామని బజాజ్ ఆటో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేష్ శర్మ పేర్కొన్నారు. డిమాండ్‌ను చేరుకోవడానికే నెట్‌వర్క్‌ను విస్తరిస్తున్నామని చెప్పారు. కాగా, తమ ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రొడక్షన్‌ను పెంచేందుకు తాజాగా రూ. 300 కోట్ల ఇన్వెస్ట్మెంట్ ప్లాన్‌ను బజాజ్ ఆటో ప్రకటించిన విషయం తెలిసిందే.
