న్యూఢిల్లీ: ఇజ్రాయెల్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా మేజర్ ఎయిర్‌లైన్స్ కంపెనీలు తమ సర్వీసులను నిలిపివేశాయి. దీంతో తిరిగి తమ దేశాలకు వెళ్లేందుకు సిద్ధమైన ప్యాసింజర్లు ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ ఎయిర్‌పోర్ట్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇండియా నుంచి అక్కడికి రాకపోకలు సాగించే విమానాలను వారంపాటు రద్దు చేసినట్లు ఎయిర్ ఇండియా ఆదివారం ప్రకటించింది. ప్రయాణికులు, సిబ్బంది భద్రత దృష్ట్యా.. టెల్ అవీవ్‌కు రాకపోకలు సాగించే విమానాలను అక్టోబరు 14 వరకు నిలిపివేసినట్లు వెల్లడించింది.
ఇప్పటికే టికెట్లు కన్ఫర్మ్ అయిన ప్యాసింజర్లకు అన్ని రకాల సహాయం చేస్తామని పేర్కొంది. ఎయిర్ ఇండియా ఢిల్లీ నుంచి టెల్ అవీవ్‌కు వారానికి 5 విమానాలు నడిపేది. అమెరికన్ ఎయిర్‌లైన్స్, ఎయిర్ ఫ్రాన్స్, లుఫ్తాన్సా, ఎమిరేట్స్, ర్యాన్ ఎయిర్, ఏజియన్ ఎయిర్‌లైన్స్, స్విస్ ఎయిర్, టర్కిష్ ఎయిర్ లైన్స్, బ్రస్సెల్స్ ఎయిర్‌లైన్స్, ఇటలీ ఫ్లాగ్ క్యారియర్‌తో పాటు పలు అంతర్జాతీయ సంస్థలు ఇజ్రాయెల్‌లోని టెల్‌అవీవ్‌కు వెళ్లే తమ విమానాలను తాత్కాలికంగా రద్దు చేసినట్లు ప్రకటించాయి.
