న్యూఢిల్లీ: ప్రపంచంలోనే తొలిసారిగా పురుషుల కోసం తయారుచేసిన సంతాన నిరోధక ఇంజెక్షన్ క్లినికల్ ట్రయల్స్‌లో మెరుగైన పనితీరు కనబరిచినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) ప్రకటించింది. ప్రపంచంలోనే తొలిసారి పురుషుల కోసం ఈ కాంట్రాసెప్టివ్ ఇంజెక్షన్‌ను డెవలప్ చేసినట్లు తెలిపింది. దీనితో ఎలాంటి సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ లేవని వెల్లడించింది. ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్ లో 25 నుంచి 40 ఏండ్ల మధ్య ఉన్న 303 మందిపై ప్రయోగాలు విజయవంతంగా నిర్వహించామని పేర్కొంది. ఈ స్టడీ వివరాలను అంతర్జాతీయ ఆండ్రాలజీ జర్నల్‌లో ఇటీవల ప్రచురించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది.
ఎలా పని చేస్తుంది?
సాధారణంగా మహిళలు గర్భం దాల్చకుండా ఉండేందుకు పురుషులు వాసెక్టమీ చేయించుకోవడం లేదా కండోమ్స్ వాడటం వంటివి పాటిస్తుంటారు. అయితే పురుషులకు ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా.. స్త్రీలు గర్భం దాల్చకుండా ఉండేలా ఐసీఎంఆర్ ఈ ఇంజెక్షన్ ను తయారు చేసింది. రివర్సిబుల్ ఇన్‌హిబిషన్ ఆఫ్ స్పెర్మ్ అండర్ గైడెన్స్(ఆర్ఐఎస్‌యూజీ) అనే ఈ ఇంజెక్షన్‌ను పురుషులకు 60 మిల్లీగ్రాముల మేరకు ఇస్తే.. వీర్యంలో శుక్రకణాలు 97.3% వరకూ తగ్గిపోతాయని.. దీంతో స్త్రీలు ఆ పురుషుల ద్వారా గర్భం దాల్చే అవకాశం 99.02 శాతం తగ్గిపోతుందని ఐసీఎంఆర్ సైంటిస్టులు పేర్కొన్నారు. ప్రస్తుతం పురుషులు, స్త్రీలు వినియోగిస్తున్న గర్భనిరోధక పద్ధతుల కంటే ఈ విధానం చాలా సురక్షితమైందని పేర్కొంది.
