AUS vs PAK: కోహ్లీని దాటేసిన బాబర్.. ప్రమాదంలో రోహిత్ రికార్డ్

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ లో ఎన్నో రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. ముఖ్యంగా పరిమిత ఓవర్ల క్రికెట్ లో దాదాపు సగం రికార్డులు విరాట్ తన ఖాతాలో వేసుకున్నాడు. సచిన్ రికార్డ్స్ ఒకొక్కటిగా బ్రేక్ చేస్తూ ఆల్ టైం బెస్ట్ బ్యాటర్ గా ముందకెళ్తున్నాడు. అయితే సమీప భవిష్యత్తులో కోహ్లీ రికార్డ్స్ బ్రేక్ చేయడం బాబర్ అజామ్ కే సాధ్యమని ఇప్పటికీ చాలామంది క్రికెట్ ఫ్యాన్స్, ఎక్స్ పర్ట్స్ భావిస్తున్నారు. ఇందులో భాగంగా టీ20లో కోహ్లీ రికార్డ్ ను ఒకటి బాబర్ అజామ్ బ్రేక్ చేశాడు. 

హోబర్ట్ వేదికగా సోమవారం (నవంబర్ 18) ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో బాబర్ అద్భుతంగా ఆడాడు. 28 బంతుల్లో నాలుగు ఫోర్లతో 41 పరుగులు చేసి టాప్ స్కోరర్ అయ్యాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ టీ20ల్లో కోహ్లీ పరుగులను అధిగమించాడు. కోహ్లీ అంతర్జాతీయ టీ20ల్లో 4188 పరుగులు చేయగా.. బాబర్ ప్రస్తుతం 4192 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ లిస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 4231 పరుగులతో అగ్ర స్థానంలో ఉన్నాడు. బాబర్ మరో 40 పరుగులు చేస్తే టీ20 క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా చరిత్ర సృష్టిస్తాడు. 

కోహ్లీ, రోహిత్ ఇప్పటికే అంతర్జాతీయ టీ20 కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించడంతో ఈ రికార్డ్ త్వరలో బాబర్ ఖాతాలోకి వెళ్లడం ఖాయమైంది. ఇప్పటివరకు 126 టీ20 మ్యాచ్ లు ఆడిన బాబర్.. 40 యావరేజ్ తో 3 సెంచరీలు.. 36 హాఫ్ సెంచరీలు చేశాడు. కెరీర్ ప్రారంభం నుంచి బాబర్ టీ20ల్లో నిలకడగా రాణిస్తున్నాడు. ప్రస్తుత ఆస్ట్రేలియా సిరీస్ లో 3 మ్యాచ్ ల్లో 47 పరుగులు చేసి విఫలమయ్యాడు.