సోషల్ మీడియా మహానుభావులు : మీ వల్లే నా జీవితం దాబా నుంచి రెస్టారెంట్ కు మారింది

సోషల్ మీడియా మహానుభావులు : మీ వల్లే నా జీవితం దాబా నుంచి రెస్టారెంట్ కు మారింది
సోషల్ మీడియా పుణ్యమా అని 80 ఏళ్ల వృద్ద దంపతుల జీవితం పూర్తిగా మారిపోయింది. ఇలా మారడానికి ఎన్నో కష్టాలు, కన్నీళ్లు ఉన్నా అనుకోని అదృష్టం వరించడంతో వాళ్ల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. అక్టోబర్ లో సౌత్ ఢిల్లీ మాళ‌వీయ న‌గ‌ర్ ప్రాంతంలో  వృద్ద దంప‌తులు  80 ఏళ్ల ప్ర‌సాద్, దేవీలు బాబా కా దాబా అనే ఓ చిన్న దాబాను గ‌త 30 ఏళ్లుగా  న‌డిపిస్తున్నారు. క‌రోనాకు ముందుకు దాబా న‌డ‌ప‌గా వ‌చ్చే నెల‌స‌రి ఆదాయం రూ.4 వేల నుంచి రూ.5 వేలు ఉండేది. కానీ ప‌రిస్థితి మారింది. క‌రోనా వ‌ల్ల స్థానికులు ఆ దాబాలో తిన‌డం మానేశారు. ఈ నేప‌థ్యంలో ఢిల్లీకి చెందిన గౌర‌వ్ వాస‌న్ అనే ఫుడ్ బ్లాగ‌ర్. బాబా క దాబా లో రోటీ త‌యారు చేస్తున్న ప్ర‌సాద్ ను ఏం తాత ఎలా ఉన్నావ్. బిజినెస్ ఎలా న‌డుస్తుంది అంటూ వారితో మాట క‌లిపాడు. మాట్లాడుతూనే వాళ్లు చేసిన ఫుడ్ ఐట‌మ్స్ అన్నీ టేస్ట్ చేశాడు. చాలా బాగున్నాయి. దీంతో ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ వీడియోతో వృద్ద దంపతులు ప్రసాద్, దేవీల జీవితం పూర్తిగా మారిపోయింది.  ప్రజా ప్రతినిధులు, బాలీవుడ్ ప్రముఖులు బాబా క దాబా గురించి ప్రమోట్ చేయడంతో దేశం మొత్తం హాట్ టాపిగ్గా మారింది. కాలం గిర్రున తిరిగింది. నాడు చిన్న దాబా కాస్త ఇప్పుడు రెస్టారెంట్ అయ్యింది. మాళవీయ నగర్ లో బాబా క దాబా ఓనర్ ప్రసాద్ రెస్టారెంట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాకు ఈ రోజు చాలా ఆనందంగా ఉంది. చిన్న దాబా నడిపే నేను రెస్టారెంట్ ప్రారంభించడానికి కారణం సోషల్ మీడియానే. మన రెస్టారెంట్ లో భారతీయ వంటకాలతో పాటు, చైనీస్ వంటకాల్ని సిద్ధంగా ఉన్నాయి. అదే సమయంలో యూట్యూబ‌ర్ గౌరవ్ వాసన్ తనని మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. తన పేరు ప్రమోట్ చేస్తూ డబ్బులు వసూలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.