అజంజాహీ మిల్లు భూములను కాపాడాలి: గోధుమల కుమారస్వామి

ముషీరాబాద్, వెలుగు: వరంగల్‎లో నిజాం కాలంలో నిర్మించిన అజంజాహీ మిల్లు​భూములను పరిరక్షించాలని తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షల వేదిక రాష్ట్ర చైర్మ న్ గోధుమల కుమారస్వామి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం తన ఆఫీసు నుంచి కుమార స్వామి ప్రకటన విడుదల చేశారు. సదరు భూములను ప్రజా ప్రయోజనాలకు ఉపయోగించుకోవాలని కోరారు. తెలంగాణ సాధనకు తెగించి కొట్లాడిన అజంజాహీ మిల్లు కార్మికులకు ప్రభుత్వం న్యాయం చేయాలన్నారు. మిల్లు  మూసివేతతో రోడ్డున పడ్డ కార్మికులకు మిల్లు స్థలంలో కొంత స్థలాన్ని పునరావాసం కింద కేటాయించాలని కోరారు. 

సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని అజంజాహీ భూములపై జ్యుడీషియల్ ఎంక్వైరీ జరిపించాలని, కార్మికులకు ఇండ్ల స్థలాలు దక్కేలా చూడాలని, మిగిలిన స్థలాన్ని ప్రజా ప్రయోజనాలకు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో వివిధ మార్గాల ద్వారా మిల్లుకు చెందిన 226 ఎకరాల భూములను ప్రభుత్వం సేకరించిందని, కొన్నేండ్లుగా మిల్లు భూమి అన్యాక్రాంతం అవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.