కరోనాను అరికట్టేందుకు ఆనందయ్య తయారు చేసిన ఆయుర్వేద ఔషధంపై ఆయుష్ పరిశోదన చేస్తోంది. ఈ క్రమంలో ఆయుష్ కమిషనర్ రాములు ఆనందయ్య ఔషదంపై సీఎం జగన్మోహన్ రెడ్డికి సోమవారం నివేదికను అందజేశారు. ఆనందయ్య కరోనా ఔషధంపై ఆయుష్ కమిషనర్ రాములు నాయక్ మరింత వివరణ ఇచ్చారు. మందుపై మూడు,నాలుగు రోజుల్లో నిపుణుల నివేదిక వస్తుందని తెలిపారు. నివేదిక పరిశీలించాక ఆనందయ్య ఔషధం కరోనా కట్టడికి పనికి వస్తుందో, లేదో నిర్ధారిస్తామని స్పష్టం చేశారు. ఆనందయ్య ఔషధంలో వాడుతున్న మూలికలు ఆయుర్వేద గ్రంథాల్లో ఉన్నవేనని తెలిపారు. ఇందులో హానికరమైన పదార్థాలేవీ లేవన్నారు. ఏ ప్రాసెస్ లో ఎంత మోతాదులో మందు తయారుచేస్తున్నారో తెలియాలని.. ఇప్పటికే మందులో వాడిన 18 రకాల మూలికలపై అధ్యయనం చేశామని రాములు నాయక్ చెప్పారు.
అయితే.. దీన్ని చట్టపరంగా మాత్రం ఆయుర్వేద ఔషధంగా చెప్పలేమన్నారు రాములు నాయక్. క్లినికల్ ట్రయల్స్ జరిగాకే ఆయుర్వేద ఔషధంగా చెప్పే అవకాశముందన్నారు. ఆనందయ్య మందును తాము ఎక్కువ చేసి చెప్పడం లేదని, అలాగని కించపరచడం లేదన్నారు. ఆనందయ్య ఔషధం గురించి సీఎం జగన్ తో చర్చించామని, పరిశోధన త్వరగా పూర్తిచేయాలని చెప్పారని తెలిపారు.
ఆనందయ్య మందుతో ఎలాంటి ప్రమాదం లేదని తేలిన తర్వాతే ప్రజలకు పంపిణీ ఉంటుందని స్పష్టం చేశారు ఆయుష్ కమిషనర్ రాములు నాయక్. CCRAS నివేదిక వచ్చిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు.
