- అయోధ్య రామమందిర్ ట్రస్ట్ ట్రెజరర్గోవింద్ దేవగిరి జీ
రామచంద్రాపురం (అమీన్పూర్), వెలుగు: ప్రపంచం సుభిక్షంగా ఉండాలన్నా, శాంతి నెలకొనాలన్నా గోమాతను రక్షించాలని అయోధ్య రామమందిర్ ట్రెజరర్ గోవింద్ దేవగిరి జీ మహరాజ్అన్నారు. గోవులను కాపాడితే వచ్చే పుణ్యం ఏం చేసినా రాదన్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ బీరంగూడలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి గోశాల 14వ వార్షికోత్సవాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గోవింద్ దేవగిరి జీ మహరాజ్ గోమాత పూజ చేశారు. అనంతరం శాంతి హోమం, ఇతర పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాచీన భారతంలో గోవుకు ఎంతో ప్రాముఖ్యం ఉండేదని కానీ మారుతున్న కాలంలో గోసంపద రోజురోజుకీ తగ్గిపోతుందన్నారు. ప్రతి ఒక్కరూ గో సంరక్షణకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక అతిథిగా హాజరైన ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ కుల, ప్రాంతీయ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ గో సేవ చేయాలన్నారు.
భీరంగూడ గోశాలలో 1200 ఆవులను సంరక్షించడం ఎంతో గొప్ప విషయమని కొనియాడారు. భీరంగూడ గోశాల అభివృద్ధికి ఎళ్లప్పుడూ ముందుంటానని చెప్పారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఆదెల్లి రవీందర్, ఎడ్ల రమేశ్, ఈర్ల రాజు, గోశాల చైర్మన్ సోహన్లాల్ ధైయిమా, అధ్యక్షుడు దామోదర్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ విఠల్ , బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.