ఆ 84 సెకన్లు : బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ సమయంలో ఈ మంత్రాన్ని జపించండి

సోమవారం (జనవరి  22)న రామ జన్మభూమి అయోధ్యలో బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు.  దీనికోసం దేశ ప్రజలే కాదు... ప్రపంచ మానవాళీ కూడా ఎదురుచూస్తున్నారు.  ఆరోజున అందరూ అయోధ్య వెళ్లాలనుకుంటారు. కాని ప్రభుత్వం అతికొద్దిమందిని మాత్రమే ఈ మహోత్తర కార్యక్రమానికి అనుమతించనుంది.  ప్రపంచ వ్యాప్తంగా ప్రజలందరూ టీవీల్లో వీక్షించేందుకు లైవ్ కార్యక్రమాన్ని వీక్షించే వెసులుబాలు కల్పించారు.  ఆ రోజు ( జనవరి 22)న అయోధ్య వెళ్లని వారు ఏం చేయాలి.. ఏ మంత్రాన్ని అనుష్ఠానం చేయాలో తెలుసుకుందాం. . .

అయోధ్యలో జనవరి 22న మహోన్నత కార్యక్రమం ఆవిష్కృతం కానుంది.  బాలరాముడి విగ్రహం ప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగనుంది. చిన్న చిన్న గ్రామాల్లో కాని.. పట్టణాల్లో కాని దేవాలయ విగ్రహాలను ప్రతిష్ఠించేటప్పుడు ఆ ఊరి ప్రజలందరూ వేడుకలు నిర్వహిస్తారు. ఇక ఆ గ్రామాల్లో పండుగ వాతావరణం సంతరించుకుంటుంది.  ఆ గ్రామం దైవనామస్మరణతో మారు మోగుతుంది. కొంతమంది అనారోగ్యం కారణంగానో... వయో భారం కారణంగా అక్కడికి వెళ్లకపోతే ఇంట్లోనే ఉండి ఆ భగవంతుడిని ధ్యానించుకుంటూ ఉంటారు.  ఇలా చేస్తే అక్కడికి వెళ్లిన వారికి ఎంత ఫలితం లభిస్తుందో వీరికి కూడా అంతే లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఇక సోమవారం (జనవరి22)న అయోధ్య వెళ్లని వారు టీవీల ముందు కూర్చొని లైవ్ కార్యక్రమాన్ని వీక్షించాలి.

జనవరి 22న ఇంట్లో ఏం చేయాలంటే...

తెల్ల వారుజామున బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవాలి.  కాలకృత్యాల అనంతరం... దేవుడి దగ్గర దీపం వెలిగించాలి.  ఆ తరువాత సీతారామ, లక్ష్మణ,భరత, శతృఘ్న సమేత ఆంజనేయుడికి షోడశోపచార పూజలు చేయాలి.  పానకం.. వడపప్పు  నైవేద్యం సమర్పంచాలి. పండ్లు, టెంకాయ మొదలైనవి సమర్పించాలి.  జైశ్రీరాం అంటూ నగర సంకీర్తన చేస్తే చాలా మంచిది.  అభిజిత్ ముహూర్తం వరకు  దీపారాధన కొండెక్కకుండాచూసుకోవాలి.  సరిగ్గా శ్రీరాముడిని ప్రతిష్టించే సమయంలో  ఈ క్రింది శ్లోకమును పఠించాలి .  టీవీని చూసేటప్పుడు.. మంచంపై కూర్చో కూడదు.. టీవీ ఉన్న గదిలో కింద చాపగాని.. ఏదైన ఇతర ఆసనం కాని వేసుకొని కూర్చోవాలి. భక్తి శ్రద్దలతో  తారకరామ మంత్రాన్ని అనుష్ఠానం చేయాలి.  ఈ కార్యక్రమం అయిన తరువాత అవకాశం ఉంటే మహానైవేద్యం పెట్టి... హారతి ఇచ్చి.. దేవుడి ఎదుట సాష్ఠాంగ నమస్కారం చేయాలి. 

అనుష్ఠానం చేయాల్సిన మంత్రం

శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే |
సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే ||

శ్రీ అనగా లక్ష్మీ. "కపటయాది" సంఖ్యా శాస్త్ర ప్రకారము 'రామ' శబ్దములోని 'రా' అక్షరమునకు "2" అనియు 'మ' అను అక్షరమునకు "5" అనియు అర్థము. ఈ అంకెలను గుణించిన, 2 x 5 = 10 అను సంఖ్య వచ్చును. ఈ శ్లోకములో  మూడు రామ శబ్దములు కలవు. అనగా ఈ శబ్దత్రయమును గుణించిన (10 x 10 x 10) 1,000 వచ్చును. అందుకే ఈ ఒక్క శ్లోకమే శ్రీ విష్ణు సహస్రనామ సమానమగును.

ఈ మంత్రాన్ని పఠిస్తే దుష్కర్మలన్నీ పటాపంచలై, మనోనిబ్బరం ఏర్పడుతుంది. ఫలితంగా మానసికానందం సొంతమవుతుంది. శివకేశవులకు భేదం లేదని తెలిపే ఈ నామ స్మరణంవల్ల సర్వసౌభాగ్యాలు సిద్ధిస్తాయి. సర్వమనోకామనలు సిద్ధించి, భవిష్యత్తు నందన వనమవుతుంది. ఆధ్యాత్మిక చింతనాసక్తి ఉన్న భక్తులంతా ఈ నామాన్ని జపించడంవల్ల ఆధ్యాత్మికాసక్తి పెరిగి, భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది.

శ్రీరామనామాన్ని ఉచ్ఛరించేటప్పుడు 'రా' అనగానే మన నోరు తెరచుకుని మనలోపల పాపాలన్ని బయటకు వచ్చి ఆ రామనామ అగ్నిజ్వాలలో పడి దహించుకుపోతాయని విశ్వాసం. అలాగనే 'మ' అనే అక్షరం ఉచ్ఛరించినప్పుడు మననోరు మూసుకుంటుంది కనుక బయట మనకు కనిపించే ఆ పాపాలు ఏవీ మనలోకి ప్రవేశించలేవట.శ్రీరాముని అనుగ్రహం పొందాలంటే ఈ ఒక్క మంత్రముతో జపిస్తే చాలునని పండితులు అంటున్నారు.

శ్రీరామ రామ రామ అని మూడుసార్లు రామ నామాన్ని జపిస్తే విష్ణు సహస్ర నామాన్ని జపించినంత పుణ్యఫలం లభిస్తుందని సాక్షాత్తు మహాశివుడు పార్వతిమాతతో చెప్పాడు. రామనామ విశిష్టత అమోఘమైనది. అద్వితీయమైనది. ఇహలోకాన్నుండే బాధలను తొలగించి, పర లోకాన ముక్తిని, మోక్షాన్ని ప్రసాదించేది. ఈ నామాన్ని సదా స్మరణం చేసే వారి ఇంట్లో లేమి ఉండదని, వారు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో, ఐశ్వర్యంతో తులతూగుతారని పురాణాలు చెబుతున్నాయి. 

కబీర్‌దాస్, తులసీదాస్, భక్తరామదాసు లాంటి మహా భక్తులెందరో రామనామమే పరమావధిగా భావించి, పునీతులయ్యారు. రామనామ విశిష్టత అనన్య సామాన్యమైనది.రామనామ మందు మంత్రాత్మకమైన నిగూఢార్ధం ఇమిడి ఉంది. ఇందులో ‘ర’కారము రుద్రుని, ‘అ’కారము బ్రహ్మను, ‘మ’కారము విష్ణువుని సూచిస్తుంది. కనుకనే ‘రామ’శబ్దం బ్రహ్మవిష్ణు, శివాత్మక రూపంగా భావించడం జరుగుతోంది. అలాగే ‘రామ’అనే శబ్దం జీవిత్మ పరమాత్మలకు స్వరూపంగా కూడా చెప్పడం జరుగుతోంది. ఇందులో ‘రా’అనే అక్షరాన్ని ‘తత్’అని అనగా ‘పరబ్రహ్మము’ అని ‘మ’ అనే అక్షరానికి ‘త్వం’ అనగా జీవాత్మ అని అర్థం చెబుతారు. అలాగే అష్టాక్షరి మహామంత్రమయిన ఓం నమో నారాయణాయ నమఃలో ‘రా’ బీజాక్షరం, పంచాక్షరి మహామంత్రమయిన ఓం నమఃశివాయలో ‘మ’ బీజాక్షరం ఇందులో ఇమిడి ఉన్నాయి. అందువల్లే ఇది రెండు మంత్రాల శక్తిని, మహత్తును కల్గి ఉందని పురాణాలు చెబుతున్నాయి. అత్యంత శక్తిదాయకమైన రామ మంత్ర జపంవల్ల ముక్తిమోక్షాలు లభిస్తాయి. కనుకనే హరిహరాత్మకమైన ఈ ‘రామ’నామ మంత్ర రాజాన్ని తారక మంత్రంగా చెప్పడం జరుగుతోంది.

భవబంధాల నుంచి తరింపచేయడంవల్లనే ‘రామ’మంత్రాన్ని తారక మంత్రమని పిల్వడం జరుగుతోంది. అంతేకాకుండా ‘రామ’ నామ శబ్దం ప్రాణాయామ శక్తిగా కూడా చెబుతారు. స్వభావ సిద్ధంగా పూరకమైన శ్వాసను ‘మ’కారంతో కుంభించి, ‘రా’కార ఉచ్ఛారణతో రేచకం చేయడం వల్ల ప్రాణాయామం సంపూర్ణంగా జరుగుతుంది. ఆ కారణంగా ‘రామ’ నామ శబ్ద ఉచ్ఛరణంవల్ల ఒక పక్క రామనామ సంకీర్తనా ఫలం, మరో పక్క ప్రాణాయామం జరిగి, ఆరోగ్యం చేకూరుతుందని శాస్తక్రోవిదులు చెబుతున్నారు. ఆ కారణంగా రామ నామాన్ని ఏకాగ్రతతో ఐదు నిముషాలు ఉచ్ఛరిస్తే, మనస్సు నిర్మలమై, ఏకాగ్రత సిద్ధిస్తుందని, సత్‌కార్యాలకు పునాది పడుతుందని చెబుతారు. త్రిమూర్త్యాత్మక రూపమైన ‘రామ’నామాన్ని నిత్యం పఠించి ఆంజనేయుడంతటి పరమభక్తుడు దైవమయ్యాడు. రామనామ స్మరణే పరమావధిగా భావించిన ఆ స్వామి జగద్విఖ్యాతినొందాడు. 

Also Read : ముస్లిం దేశం నుంచి అయోధ్యకుస్పెషల్ గిఫ్ట్.. ఏంటంటే...

రామనామమే తన ఉచ్ఛ్వాస నిచ్చ్వాసలుగా భావించిన కబీరు, భక్తరామదాసులాంటి మహాభక్తులు స్వామి కృపకు పాత్రులై, జగద్విఖ్యాతి నొందారు. రామ నామంలోని విశిష్టతను, మహత్తును తెలిసిన పరమేశ్వరుడు, ఆ మంత్రాన్ని జపించమని సాక్షాత్తు పార్వతి మాతకు చెప్పాడు. శ్రీహరి సాక్షాత్తు శ్రీమహాలక్ష్మికి రామనామ శబ్దానికున్న మహత్తును వివరించాడు. రామ నామం విశేషమైనది. గొప్ప మహత్తు కలది. భవ బంధాలనుంచి దూరం చేసి, ముక్తిని మోక్షాన్నిచ్చేది. ఆ కారణంగానే ఇది పరమోత్కృష్ట మంత్ర రాజంగా పూజింపబడుతోంది. రామనామ స్మరణంవల్ల బ్రహ్మవిష్ణు, శివులను పూజించిన ఫలం దక్కుతుంది. దీనివల్ల విష్ణుసహస్ర నామాన్ని, శివ పంచాక్షరిని పూజించిన ఫలం దక్కుతుంది. ‘రామ’శబ్దంలోని రెండు అక్షరాలు మనో నిగ్రతను పెంచి, ఏకాగ్రతను వృద్ధిచేసి ఆధ్యాత్మిక ద్వారాలను తెరుస్తాయి.