న్యూఢిల్లీ, వెలుగు: స్మార్ట్ సిటీలకు కేంద్రం ఇచ్చే నిధులపై కేసీఆర్ ఫ్యామిలీ అబద్ధాలు చెబుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైరయ్యారు. కేంద్రం మీద నిందలు మాని పాలనపై దృష్టిని పెట్టాలని సూచించారు. మూడేండ్లుగా స్మార్ట్ సిటీల కింద రాష్ట్రానికి కేంద్రం ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదంటూ సోషల్ మీడియాలో టీఆర్ఎస్ విష ప్రచారం చేస్తోందని దుయ్య బట్టారు. స్మార్ట్ సిటీ నిధులను తెలంగాణ సర్కార్ దారి మళ్లించిందని ఆరోపించారు. స్మార్ట్ సిటీ స్కీమ్ కింద కేంద్రం ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన నిధుల డేటాను బుధవారం ఆయన ఢిల్లీలో మీడియాకు రిలీజ్ చేశారు. స్మార్ట్ సిటీ మిషన్ ప్రోగ్రామ్ కింద కరీంనగర్, వరంగల్ సిటీలకు రూ. వెయ్యి కోట్లు కేటాయించి రూ.392 కోట్లను రీలీజ్ చేసినట్లు చెప్పారు. అయితే, తెలంగాణ సర్కార్ 50 శాతం మ్యాచింగ్ గ్రాంట్స్ ను ఇప్పటికీ పూర్తిగా విడుదల చేయలేదన్నారు. 2015–-16 నుంచి స్మార్ట్ సిటీ మిషన్ స్కీమ్ కు కేంద్రం నిధులను కేటాయిస్తుంటే, తెలంగాణ సర్కార్ ఆరేండ్లుగా ఒక్క రూపాయి కూడా రిలీజ్ చేయడం లేదని వెల్లడించారు. కేంద్రం ఒత్తిడి మేరకు 2021–-22 ఫైనాన్షియల్ ఇయర్ లో వరంగల్ స్మార్ట్ సిటీ కోసం రూ.50 కోట్లు విడుదల చేసిందన్నారు. కేంద్రం రిలీజ్ చేసిన రూ.196 కోట్లను కూడా వరంగల్ నగరానికి వెంటనే బదిలీ చేయలేదని చెప్పారు. ఐదు హెరిటేజ్ సిటీ ప్రాజెక్టుల కోసం కేంద్రం ఇచ్చిన రూ.32 కోట్ల అదనపు నిధులను కూడా ఆలస్యంగా రిలీజ్ చేసినట్లు తెలిపారు.
అమృత్ 2.0 స్కీమ్కింద రూ.2,780 కోట్లు
రాష్ట్రంలోని వివిధ పట్టణాల్లో మెరుగైన సౌకర్యాలను కల్పించడం కోసం అమృత్ 2.0 స్కీమ్ కింద రూ. 2,780 కోట్లను కేంద్రం కేటాయించిందని కిషన్రెడ్డి తెలిపారు. ఈ స్కీమ్ ఫస్ట్ ఫేజ్ లో భాగంగా రాష్ట్రంలోని 12 టౌన్స్ లో రూ.1,660 కోట్ల వ్యయంతో 66 ప్రాజెక్టులు చేపట్టినట్టు వెల్లడించారు. అయితే రాష్ట్ర స్థాయిలో వివిధ శాఖల మధ్య సమన్వయం లేక పనులు ముందుకుసాగడం లేదన్నారు. కీలకమైన శాఖలన్నీ ఒకే కుటుంబం చేతిలో ఉండడం వల్ల ఏ శాఖ కూడా సరిగా పనిచేయడం లేదన్నారు.
