న్యూఢిల్లీ: రిపబ్లిక్ డే నాడు దేశ రాజధానిలో రైతులు తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. బారికేడ్లను తొలగిస్తూ బార్డర్‌ను దాటుకుంటూ ఢిల్లీలోకి దూసుకొచ్చిన రైతులను పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా తయారైంది. అన్నదాతలను నిలువరించడానికి పోలీసులు లాఠీచార్జ్ చేయడంతోపాటు టియర్ గ్యాస్‌ను కూడా ప్రయోగించారు. ఈ ఘటనలో ఓ ట్రాక్టర్ అదుపు తప్పడంతో ఒక యువ రైతు చనిపోయాడు. అతడి పేరు నవ్‌రీత్ సింగ్. అయితే ట్రాక్టర్ బోల్తా పడి నవ్‌రీత్ చనిపోలేదని అతడి కుటుంబం ఆరోపిస్తోంది.
నవ్‌రీత్‌ను పోలీసులు కాల్చారా?
నవ్‌రీత్‌ను ఢిల్లీ పోలీసులే కాల్చి చంపారని, ఘటన జరిగిన ఐటీవోకు దగ్గరలో ఉన్న రైతులు ఈ విషయం తమకు చెప్పారని అతడి ఫ్యామిలీ చెబుతోంది. దీంతో సదరు ట్రాక్టర్ బోల్తా పడిన వీడియోను ఢిల్లీ పోలీసులు విడుదల చేశారు. సదరు వీడియోలో నవ్‌రీత్ నడుపుతున్న ట్రాక్టర్ పోలీసుల బారికేడ్‌ను ఢీకొడుతూ పల్టీ కొట్టింది. అయితే ట్రాక్టర్ నడుపుతున్న నవ్‌రీత్‌ను పోలీసులు కాల్చడంతో అతడు వాహనంపై అదుపు కోల్పోయాడని, దీంతో బండి పల్టీ కొట్టిందని ఘటనను చూసిన రైతులు చెబుతున్నారు.
‘మమ్మల్ని చీట్ చేశారు.. కోర్టులో తేల్చుకుంటాం’
నవ్‌రీత్‌ను పోలీసులు కాల్చి చంపారని అతడి తాత హర్దీప్ సింగ్ దిబ్‌దిబా ఆరోపించారు. ‘నవ్‌రీత్ శరీరంలో బుల్లెట్ గాయాలను చూశామని ఒక పోస్టు మార్టం చేసిన డాక్టర్ మాకు చెప్పారు. మమ్మల్ని మోసం చేశారు. పోస్ట్ మార్టం రిపోర్టులో నిజాలు వెల్లడి కాలేదు. రిపోర్టు వెల్లడించిన తర్వాత కూడా నవ్‌రీత్ దేహంపై బుల్లెట్ గాయలను చూశానని ఆ డాక్టర్ మాకు చెప్పారు. కానీ అతడి చేతిలో ఏమీ లేదు. నిజాలు బయటకు రాకుండా ఆ డాక్టర్లను బెదిరించారు’ అని హర్దీప్ సింగ్ అన్నారు.
