మోడల్ ఆటోనగర్ ఏర్పడేనా?

  • ప్లాట్ల కేటాయింపులపై ఖరారు కాని విధి విధానాలు
  • ఏడాదిగా పెండింగ్ లో పనులు
  • ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురుచూపులు

సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట పట్టణ శివార్లలోని ఇండస్ట్రియల్ పార్క్ లో ఏర్పాటు చేయాలనుకున్న ఆటోనగర్ పై నీలినీడలు కమ్ముకున్నాయి. 25 ఎకరాల విస్తీర్ణంలో రూ.15 కోట్లతో ఏర్పాటు చేయాలని నిర్ణయించి 2022 ఆగస్టులో శంకుస్థాపన చేశారు. మౌలిక వసతులను కల్పించి అన్ని రకాల వాహనాలను రిపేర్ చేసే 360 మంది మెకానిక్ లను గుర్తించారు. 

వీరితో ఒక సొసైటీని ఏర్పాటు చేసి ఆయా వాహనాల అవసరాలకు తగినట్టుగా ప్లాట్లను కేటాయించి మోడల్ ఆటోనగర్ గా తీర్చిదిద్దే ప్రయత్నం చేశారు. ఏడాది కింది వరకు భూమిని చదును చేసి ప్లాట్లను రెడీ చేసి రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ సౌకర్యాలకు సంబంధించి పనులు పూర్తి చేశారు. పట్టణంలోని వాహన విక్రయ యజమానులను సైతం షాపులను ఆటోనగర్ కు తరలించే విధంగా 
ప్లాన్ ​చేశారు. 

కేటగిరీల ప్రకారం ప్లాట్ల కేటాయింపులు

లారీ, ఆటో, డీసీఎం వాహనాల రిపేర్ షెడ్లకు టీజీఐఐసీ నియమ నిబంధనల ప్రకారం 200 నుంచి 500 వందల గజాల వరకు స్థలాలను కేటాయించాలని నిర్ణయించారు. ఇందుకోసం టీజీఐఐసీ, ప్రభుత్వం కలిసి డెవలప్​మెంట్​ఛార్జీలను నిర్ధారించి దాని ప్రకారం ప్లాట్ల కేటాయింపు ప్రక్రియ నిర్వహించాల్సి ఉంటుంది. కేటాయించిన ప్లాట్ సైజ్ ను బట్టి మొత్తం విస్తీర్ణాన్ని గజం చొప్పున డెవలప్​మెంట్​ఛార్జీలను లెక్కించి డబ్బులు చెల్లించిన వారికి స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేస్తారు.

స్థల యజమానికి డెవలప్​మెంట్​ఛార్జీలు భారం కాకుండా ఉండేందుకు బ్యాంకు రుణాలు అందించేవిధంగా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. కానీ ఆటోనగర్ లో ప్లాట్ల కేటాయింపు పూర్తిగా నిలిచిపోయింది. దీనిపై టీజీఐఐసీ, ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోవడం లేదు. 

మారిన రాజకీయ పరిణామాలతో పెండింగ్

రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో సిద్దిపేటలో మోడల్ఆటో నగర్ ఏర్పాటు పై ప్రతిష్టంభన నెలకొంది. గతేడాది కాలంగా ఆటోనగర్ లో  ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. దీంతో నిర్థారిత స్థలంలో పెద్ద ఎత్తున గడ్డి మొలిచి చిన్న పాటి అడవిని తలపిస్తోంది. ఆటోనగర్ లో షాపుల కోసం వాహన యజమానులతో సొసైటీ ఏర్పాటు చేసినా వారితో టీజీఐఐసీ, అధికారులు ఎటువంటి సంప్రదింపులు చేయడంలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం, టీజీఐఐసీ, దృష్టిపెట్టి షాపుల కేటాయింపు, డెవలప్​మెంట్​ ఛార్జీలను నిర్థారణ పూర్తి చేస్తేనే ఆటో నగర్ కు ముందడుగు పడే అవకాశం ఉంది.