- మరో 3 కంపెనీలూ పెంచుతున్నయ్
- వచ్చే నెల నుంచి టాటా, హోండా, రెనాల్ట్ ధరల పెంపు
న్యూఢిల్లీ: మారుతీ, ఆడి, బెంజ్ తమ వెహికల్స్ రేట్లను పెంచుతున్నట్టు ప్రకటించగా, మరో నాలుగు కంపెనీలూ ఇదే బాటపడ్డాయి. వచ్చే నెల నుంచి తమ ప్రొడక్టుల ధరలు కూడా పెరుగుతాయని టాటా, హోండా, రెనాల్ట్ ప్రకటించాయి. పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చుల వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెబుతున్నాయి. మోడల్‌ను బట్టి ధరలు మారుతాయని మారుతీ పేర్కొంది. కొన్ని మోడళ్లపై రెండు శాతం వరకు పెంపు ఉంటుందని మెర్సిడెస్ -బెంజ్ పేర్కొంది. అన్ని మోడల్స్ ధరలను మూడుశాతం వరకు పెంచుతామని ఆడి తెలిపింది. "సరకుల ధరలు, రవాణా ఖర్చులు పెరుగుతూనే ఉన్నాయి. ఇతర ఇన్‌పుట్ ఖర్చులు ఎక్కువ అవుతూనే ఉన్నాయి. ఈ ఖర్చుల పెరుగుదలలో కొంత వరకు అయినా కస్టమర్‌కు బదిలీ చేయాల్సి ఉంటుంది’’ అని టాటా ప్యాసింజర్ వెహికల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ శైలేష్ చంద్ర అన్నారు. డొమెస్టిక్ మార్కెట్‌లో టాటా మోటార్స్ పంచ్, నెక్సాన్, హారియర్ వంటి మోడళ్లను విక్రయిస్తోంది. హోండా కార్స్ ఇండియా కూడా సమీప భవిష్యత్తులో ధరలను పెంచుతామని పేర్కొంది. ఇది ఈ ఏడాది ఆగస్టులో చివరిసారిగా వెహికల్స్ ధరలను పెంచింది. జనవరి నుండి తమ వెహికల్స్ ధరలను ఎక్కువగానే పెంచుతామని రెనాల్ట్ పేర్కొంది. ఈ ఫ్రెంచ్ కంపెనీ క్విడ్, ట్రైబర్, కిగర్ వంటి మోడళ్లను ఇండియా మార్కెట్లో అమ్ముతోంది. గత ఏడాది కాలంగా ఉక్కు, అల్యూమినియం, రాగి, ప్లాస్టిక్ విలువైన లోహాల వంటి నిత్యావసర వస్తువుల ధరలు చాలా పెరగడంతో కంపెనీలు ధరలను పెంచుతున్నాయి. అంతేకాకుండా, రవాణా ఖర్చులూ ఎక్కువయ్యాయి.
